RS Praveenkumar | తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి రైతులు, భూమి ఉన్న మిగితా ప్రజలు వారందరి ఆస్తుల మీద జరుగుతున్న ఘోరమైన కుట్ర గురించి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పారని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఒకవైపు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ముప్పు, వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ కూడా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లను ఆన్ చేయకుండా.. నీళ్లు రైతుల పొలాల్లోకి రాకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ పేరు మార్చిన భూభారతి పోర్టల్‌లో భూమి ఉన్న రైతులు జిల్లా అధికారుల దగ్గరికి మిస్సింగ్ సర్వే నంబర్ల గురించి కానీ, పేరు మార్పిడి గురించి కానీ, విరాసత్ చేయించుకోవడానికి కానీ పీవోబీ అంటే నిషేధిత జాబితా భూముల్లో అక్రమంగా మా భూములు పెట్టారని, సాదాబైనామా భూముల బదిలీల గురించి రైతులంతా అధికారుల దగ్గరికి తిరుగుతుంటే.. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూభారతి పోర్టల్‌లో అక్రమంగా దాదాపుగా 22 వేల బదిలీలు జరిగినయి. అంటే 22 వేల మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే వాళ్ల ప్రమేయం లేకుండానే వేరేవాళ్లకు బదలాయించబడ్డాయన్నారు.
ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కాని పెట్టడం జరిగిందన్నారు. ఈ భూములన్నీ కూడా ఈ భూమి హక్కులదారులెవరైతే ఉన్నారో.. పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు జరిపి ఈ భూములన్నీ తమకిష్టమైన వాళ్లకు బదలాయించుకున్నారన్నారు.
రైతుల ఇబ్బందులు తొలగించేందుకే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చే వరకు ధరణి బాగానే పనిచేసింది. ప్రభుత్వ పెద్దల అండతోనే తెలంగాణలో భూఅక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలే భూకబ్జాలు చేస్తున్నారని తెలిపారు. భూభారతిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయనిఆరోపించారు. కాంగ్రెస్ అండతో భూమాఫియా రెచ్చిపోతుందన్నారు.
Live: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero మీడియా సమావేశంhttps://t.co/Be6i0oUiq1
— BRS Party (@BRSparty) July 7, 2026