చిన్న చిన్న ఆశై
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: మధుబాల, ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి, తంబి రామయ్య, కాళి వెంకట్, విష్ణు అగస్త్య తదితరులు
దర్శకత్వం: వర్ష వాసుదేవ్
మాలీవుడ్ సినిమాలు.. మనసును హత్తుకొంటాయి. మానవ సంబంధాలను అత్యంత సహజంగాఆవిష్కరిస్తాయి. అతిశయోక్తులకు దూరంగా.. రోజువారీ జీవితానికి అత్యంత దగ్గరగా ఉండే కథలను హృద్యంగా చెబుతాయి. తెరపై కనిపించే పాత్రలు మన పక్కింటి వారో, మన కుటుంబ సభ్యులో, సరిగ్గా మనలాంటి వారేననే భావన కలిగిస్తాయి. ముఖ్యంగా.. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం-ప్రేమను తెరపై ఆవిష్కరించడంలోనూ తమకు సాటిలేదని చాటుతాయి. ఇలాంటి నేపథ్యంలో మలయాళంలో వచ్చిన సినిమా.. ‘చిన్న చిన్న ఆశై’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఏకంగా ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వచ్చి.. రికార్డులను కొల్లగొడుతున్నది.
పవిత్ర వారణాసి నగరం నేపథ్యంలో.. ఈ కథ సాగుతుంది. 52 ఏళ్ల లీల (మధుబాల)ది తమిళనాడులోని తంజావూరు. అప్పటికే ఓ కొడుకు ఉన్న వ్యక్తికి రెండో భార్యగా వెళ్తుంది. జీవితం ఒక మోడుగా మారిపోయిందనే నిరాశలో కూరుకుపోతుంది. జీవితంలో అన్నీ కోల్పోయి.. చివరికి విధవగా మారుతుంది. ఈ క్రమంలో ఒక బృందంతో కలిసి కాశీ యాత్రకు వస్తుంది. మరోవైపు మాధవన్ మాస్టారు (ఇంద్రన్స్).. ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. ఈయన గతంలోనూ ఎంతో విషాదం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. ఏడాదిన్నరకే కూతురిని తన చేతుల్లో పెట్టి చనిపోతుంది. దాంతో ఒంటరిగానే కూతురు జానకీ (అపర్ణ బాలమురళి)ని పెంచి పెద్దచేస్తాడు. జానకి బెనారస్ యూనివర్సిటీలో కథక్ మాస్టర్స్ చేస్తుంటుంది.
దాంతో, కూతురి కోసం తరచుగా వారణాసికి వస్తుంటాడు. అలా కాశీకి వచ్చిన మాధవన్‌కు.. ఒంటరిగా, భయంతో ఏడుస్తూ కూర్చున్న లీల కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు అడుగుతాడు. ఆమె పర్స్, సెల్‌ఫోన్‌ను ఒక దొంగ కాజేశాడనీ, అతణ్ని వెంబడించే ప్రయత్నంలో తన బృందం నుంచి తప్పిపోయిందని అర్థం చేసుకుంటాడు. ఆమెను తన గ్రూప్ దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే.. సాయంత్రం గంగా హారతికి అందరూ వస్తారనీ, అక్కడ తనవాళ్లను తప్పకుండా కలుసుకోవచ్చని చెబుతాడు. అయితే, గంగా హారతికి చాలా సమయం ఉంటుంది. తనకు వారణాసి చూడాలని ఉందని లీల చెప్పడంతో.. ఆమెను వెంట బెట్టుకొని చుట్టు పక్కల ప్రదేశాలను చూపిస్తాడు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసి, ఒంటరిగా మిగిలిన ఈ ఇద్దరి పరిచయం.. వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? వారణాసి యాత్రలో.. లీల-మాధవన్ మధ్య ఎలాంటి బంధం ఏర్పడుతుంది? చివరికి ఏం జరుగుతుంది? అనేది సినిమాలో చూడాల్సిందే!