CV Anand | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సహకరించిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితితో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం ఉదయం 10:30 గంటలకే అన్ని జంక్షన్లను, ఫ్లై ఓవర్లను తెరిచామని తెలిపారు.
అయితే గణేశ్ నిమజ్జన ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటల వరకు ముగిసేలా ప్లాన్ చేశామని సీపీ తెలిపారు. కానీ కొన్ని మండపాల నిర్వాహకులు సహకరించకపోవడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ముందే మండపాల నిర్వాహకులతో సమావేశమై.. సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి చాలా వాహనాలు ఫెయిల్ కావడం, భారీ గణనాథులకు విద్యుత్ తీగలు అడ్డు తగలడం వంటి కారణాలతో కూడా నిమజ్జన ప్రక్రియ ఆలస్యమైందన్నారు.
గత పది రోజుల నుంచి హుస్సేన్ సాగర్లో లక్షకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 20 వేలదాకా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఇక నిమజ్జన ప్రక్రియ బందోబస్తుకు 25 వేల మంది విధుల్లో ఉన్నారని తెలిపారు. ఇందులో సిటీ నుంచే 15 వేల మంది పోలీసులు ఉన్నారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అన్నదాతలకు అండగా నిలుస్తున్న అగ్రి హబ్.. సంతోషంగా ఉందన్న కేటీఆర్