Bandi Sai bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. బండి సాయి భగరీథ్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని.. కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి తరుపు లాయర్ వాదనలు వినిపించారు. నిందితుడు బండి భగీరథ్ తండ్రి కేంద్రమంత్రి కాబట్టి కేసుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ కేసులో ఇంకా సాక్షులను విచారణ చేయాల్సి ఉందని.. నిందితుడు బెయిల్‌పై వస్తే బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుందని కోర్టుకు నివేదించారు.
నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామని.. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరించామని కోర్టుకు తెలిపారు.
బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో బాలికను పరిచయం చేసుకుని పలు మార్లు లైంగింక దాడికి పాల్పడ్డాడని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో మరి భగీరథ్‌కు బెయిల్ వస్తుందా..? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది.