Trisha | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, నటుడు రానా దగ్గుబాటి మధ్య ఉన్న స్నేహం గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిద్దరి అనుబంధంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రానాతో తనకున్న బంధం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష మాట్లాడుతూ.. తనకు, రానాకు దాదాపు 18 ఏళ్ల వయసు నుంచే పరిచయం ఉందని చెప్పారు. అప్పట్లో తాను చెన్నైలోని టి.నగర్లో నివసించేదాన్నని, ఎదురుగా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుటుంబం ఇల్లు ఉండేదని గుర్తు చేసుకున్నారు. రానా కూడా తన బాల్యంలో ఎక్కువ కాలం చెన్నైలోనే గడిపాడని, అలా చిన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిపారు.
తమ అనుబంధాన్ని త్రిష ఆసక్తికరంగా వివరిస్తూ.. మా కథకు ముగింపు ఉండదు. కొన్నిసార్లు చాలా మంచి స్నేహితులుగా ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడుకోం కూడా. మా బంధం ఒక లవ్-హేట్ రిలేషన్షిప్లాంటిది అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ స్నేహం కొనసాగుతోందని, జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా పూర్తిగా ఒకరినొకరు దూరం చేసుకోలేని బంధం తమదని వెల్లడించారు. రానాను చాలామంది “లేడీస్ మ్యాన్” అని పిలవడం గురించి అడిగిన ప్రశ్నకు త్రిష నవ్వుతూ స్పందించారు.అవును.. అతను లేడీస్ మ్యాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. అది నిజమే అంటూ స్పష్టంగా చెప్పారు. అయితే అదే సమయంలో రానాలో తనకు అత్యంత నచ్చే విషయం అతని వ్యక్తిత్వమని వివరించారు.
రానా ఎంత పెద్ద సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించడని త్రిష చెప్పారు. అతను చాలా గ్రేస్ఫుల్ పర్సన్. మా మధ్య గొడవ జరిగినా, మాట్లాడుకోకపోయినా.. ఎప్పుడూ అందరితో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవమే అతనిలో నాకు ఎక్కువగా నచ్చే లక్షణం అని ఆమె పేర్కొన్నారు. రానా నిజమైన జెంటిల్మన్ అని, తనకు నచ్చిన విధంగానే జీవించే వ్యక్తి అని కూడా త్రిష ప్రశంసించారు. తన సినీ ప్రయాణం ప్రారంభ దశలో ‘వర్షం’ సినిమా కోసం జరిగిన ఫోటోషూట్ సమయంలోనే రానాను మొదటిసారి కలిశానని త్రిష గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ స్నేహం ఎన్నో దశలు దాటిందని, కానీ పూర్తిగా ముగిసిన సందర్భం ఎప్పుడూ లేదని చెప్పారు. మొత్తానికి, త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.