Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1,764 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,762 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.9 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్‌లో ఇప్పటికే 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు జలమండలి అధికారులు. ఇవాళ మరోసారి హిమాయత్ సాగర్ గేట్లను జలమండలి అధికారులు ఎత్తనున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుణుడు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆకాశానికి చిల్లు పడిందా..! అన్నట్టుగా రెండు నుంచి మూడు గంటలు ఈదురు గాలుల బీభత్సంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి.
ప్రధానంగా ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సానికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మొత్తంగా ట్రాఫిక్ జాం వాహనదారులకు తీవ్ర నరకాన్ని చూపించింది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ, మధ్య బంగాళఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Wine Shops | శుక్ర, శనివారాలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు ఓపెన్
Yadadri Laddu | యాదగిరిగుట్ట ప్రసాదాలపై అప్రమత్తం.. హైదరాబాద్ ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు