మహా నగర పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాకుండా వాటిలో అనుమతి లేని నిర్మాణాలెన్నో వెలిశాయి. ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణపై ‘జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలి’ అంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 3,532 చెరువులు ఉన్న హెచ్ఎండీఏలో 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, ఎఫ్టీఎల్లను నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులను ఖరారు చేసింది. కాగా, మరో మూడు నెలల్లో 1000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని హైకోర్టు హెచ్ఎండీఏను ఆదేశించింది. దీంతో గడువు సమీపిస్తున్నది. నవంబర్‌లోగా పని పూర్తి చేయాల్సి ఉంది. కాని, పనిలో మాత్రం పురోగతి కన్పించడం లేదు. కాగా, హెచ్ఎండీఏపై దినదినం ఒత్తిడి పెరుగుతూ వస్తున్నది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఖరారు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్నాళ్లు చోద్యం చూసిన యంత్రాంగం, హైకోర్టు అక్షింతలతో ఒత్తిడికి గురవుతున్నది. ఏడు జిల్లాల్లో విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలోని చెరువుల సంరక్షణపై ప్రత్యేక నివేదికతో రావాలంటూ ఆదేశించడంతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. బఫర్ జోన్ హద్దులను చెరిపేసి ఆక్రమించుకోవడంతో చెరువుల స్వరూపం కోల్పోయింది. ఇన్నాళ్లు కనీసం బఫర్, ఎఫ్టీఎల్ జోన్ ప్రాంతాన్ని నిర్ధారించడంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా చెరువు భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు “చెరువులను రక్షించండి.. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ చేయండి” అంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఉన్నత న్యాయ స్థానం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల స్థితిగతులపై అధికారులను ప్రశ్నించింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నవంబర్‌లోగా ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ అంశంపై హెచ్ఎండీఏ కమిషనర్ మూడుసార్లు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినా ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడం అధికారులను ఒత్తిడి గురి చేస్తోంది.
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ 3,532కి పైగా చెరువులను కలిగి ఉంది. చెరువు హద్దుల నిర్ధారణ, పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునీకరణ కార్యకలాపాలను హెచ్ఎండీఏనే చేపడుతుంది. ఇప్పటి వరకు 2,525 చెరువులకు మాత్రమే ప్రాథమికంగా హద్దులను ఖరారు చేసింది. ఇందులో 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ను నిర్ధారించారు. ఈ క్రమంలో చెరువుల పరిరక్షణలో కీలకమైన బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఎందుకు ఖరారు చేయాలని హెచ్ఎండీఏను ప్రశ్నించి, 3 మూడు నెలల్లో మిగిలిన 1000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని స్పష్టం చేసింది. కానీ, హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం చెరువులు, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణలను ఇప్పటివరకు తేల్చలేకపోయారు. నగరంలో జలావరణాన్ని పెంపొందించే చెరువుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని హైకోర్టు హెచ్ఎండీఏపై ఘాటుగా ప్రశ్నించినా.. పరిరక్షణలో కీలకమైన హద్దుల నిర్ధారణపై హెచ్ఎండీఏ అమలు చేస్తున్న కార్యాచరణ నత్తనడకన కొనసాగుతూనే ఉన్నది.
నగర శివార్లలో ఉన్న చెరువుల్లో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎఫ్టీఎల్ భూముల్లో రియల్ వ్యాపారులు భారీ నిర్మాణాలు చేపట్టారు. ఆయా చెరువు పరీవాహక ప్రాంతాల్లో వెలసిన నిర్మాణ కార్య కలాపాలను నియంత్రించేలా చెరువుకు సుమారు 20 – 30 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌గా నిర్ధారించింది. మెజార్టీ చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయని, ఇటీవల హైడ్రా, ఎన్నార్ఎస్సీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. ప్రధాన చెరువుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 60 శాతం మేర తగ్గినట్లుగా గుర్తించింది. కానీ, ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికీ నిర్ధారించలేదు. దీంతో హెచ్ఎండీఏ అధికారులతో హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తేలింది. ఈ క్రమంలో ఎంతో పకడ్బందీగా చెరువుల హద్దులను నిర్ధారణ చేయాల్సి ఉన్నా హెచ్ఎండీఏ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది.