సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం మినహా ఆహారపు సరఫరాకు సంబంధించిన ఇతర హోటల్స్‌ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చంటూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అంతర్గతంగా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్క్యూలర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హైదరాబాద్‌లో రాత్రి 10 గంటలకే దుకాణాలు మూసేస్తూ ప్రజలపై లాఠీ ఛార్జీ చేస్తున్నారని, ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం అర్ధరాత్రి ట్రై కమిషనరేట్ల పరిధిలో దుకాణాలు తెరుకోవచ్చంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం దుకాణాలు తెరిచే విషయంలో సిబ్బందికి అంతర్గతంగా సర్క్యూలర్ జారీ చేసినట్లు సమాచారం.