KTR | హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు వడ్ల బస్తాలు మోసి కష్టపడ్డారు.. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు. అయితే ఆయన ఏ సంచులు మోస్తున్నాడో నాకంటే మీకే బాగా తెలుసు.. ఆ మూటలను రేవంత్ రెడ్డి ఎక్కడికి మోస్తున్నాడో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం డబ్బుల మూటలు మోసి మోసి తను కష్టపడుతున్నాడన్నారు.
నాడు బీఆర్ఎస్ హయాంలో భూములకు ఉన్న రేట్లు… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల కోసం కొట్లాడుతున్న మా మీద ఈ రేవంత్ రెడ్డి రెండు కేసులు పెడతారు, మాకేం పర్వాలేదు. ఒకవేళ మీ మీద కేసులు పెడితే మాత్రం తన వీపు సాపవుతుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసునన్నారు.
ఏ రకమైన సమస్యలున్నా నెరవేర్చే బాధ్యత నాది..
గతంలో హమాలీలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ దయతో 8 రూపాయలు ఉన్న రేట్లను 26 రూపాయలకు పెంచడం జరిగింది. అది కేసీఆర్ ఘనతగా వారు భావించి సంతోషపడ్డారని చెప్పారు. రేట్లు పెంచుకున్నామని హమాలీలు సంబరపడ్డారు. గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెరిగితే, కేసీఆర్ వచ్చాక రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నామని హమాలీ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. హమాలీ కార్మికులకు ఆరోగ్య భద్రతతోపాటు ఏ రకమైన సమస్యలు ఉన్నా నెరవేర్చే బాధ్యత మనదన్నారు. ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం తథ్యం, అంతే కాకుండా హమాలీల సమస్యలు తీర్చడం సైతం జరుగుతుంది.. ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అన్ని తీర్చే బాధ్యత నాది.
తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు పండాయో మీ అందరికీ తెలుసు, ఏ విధంగా పంటలు సస్యశ్యామలంగా మారాయో మీ అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. కేసీఆర్ వచ్చాక ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే విధంగా అటు రైతులు కష్టపడితే, ఇటు బస్తాలు మోసి మోసి హమాలీ కార్మికులు మీ వీపులు కాయలు కాచిన పరిస్థితి నెలకొంది. ఇంకా రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఏ చిన్న సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరించుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
