బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 02:23:27

తగ్గిన మరణాలు.. అస్థికలు కూడా స్టోర్‌ రూముల్లోనే ..

తగ్గిన మరణాలు.. అస్థికలు కూడా స్టోర్‌ రూముల్లోనే ..

బన్సీలాల్‌పేట్‌/అంబర్‌పేట : పుట్టుక, చావులను ఎవరూ ఆపలేరు. అది దైవ నిర్ణయమంటారు కొందరు.. కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మానవ జీవనంపై తీవ్రప్రభావం చూపింది. ఒకవైపు ప్రాణాలను కబళిస్తున్న వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో మరణాల రేటు కాస్త తగ్గింది. ఇందుకు నగరంలోని అతి పెద్ద శ్మశాన వాటికల్లో నెలకొన్న పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం. లాక్‌డౌన్‌ సమయంలో అంత్యక్రియలు తగ్గిపోయాయి. మనుషులు స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశాల్లో దాడులు తగ్గిపోయాయి. దీంతో పాటు ఒత్తిడికి లోనయ్యే మరణాలకు ఫుల్‌స్టాప్‌ పడింది.  గత రెండు నెలలుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా అన్ని మూతబడ్డాయి. 60 రోజులుగా జనం ఎక్కడికక్కడే ఇంటికే పరిమితమయ్యారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా మరణాలు తగ్గడంతో లాక్‌డౌన్‌ ప్రభావం శ్మశానవాటికలపై కూడా పడింది.  సికింద్రాబాద్‌లో అతిపెద్దదైన బన్సీలాల్‌పేట్‌లోని హిందూ శ్మశానవాటికలో లాక్‌డౌన్‌ కాలంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా అంత్యక్రియలు జరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు వరకు ప్రతిరోజు  12 నుంచి 16 అంత్యక్రియలు జరిగేవి. అందుకు భిన్నంగా లాక్‌డౌన్‌ సమయంలో కేవలం 3 నుంచి 6 వరకే అంత్యక్రియలు జరిగాయని శ్మశానవాటిక ఇన్‌చార్జి బండి శాంతి కుమార్‌ తెలిపారు.  మరి ఈ అరవై రోజు లు ఏం జరిగిందని మరణాలు ఎలా తగ్గిపోయాయి ? ఇదే ప్రశ్నను ఆయనను అడుగగా.. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు లేవన్నారు. మద్యం దుకాణాలు మూసివేతతో క్షణికావేశంలో దారుణాలు చోటు చేసుకోలేదన్నారు. కుటుంబాలన్నీ ఒకేచోట ఉండడంతో అనుబంధాలు పెరిగాయని, తద్వారా ఆత్మహత్యలు లాంటివి తగ్గిపోయాయన్నారు. అనారోగ్యం, వయోభారం కారణంగా మరణాలు మా త్రమే చోటుచేసుకున్నాయి. 

అంబర్‌పేటలోనూ ఇదే పరిస్థితి..

అంబర్‌పేటలో రద్దీగా ఉండే శ్మశాన వాటికలు బోసిపోతున్నాయి. కరోనా ప్రభావం లేక ముందు ఈ శ్మశానవాటికకు ప్రతిరోజు 15 నుంచి 20 మృతదేహాలు అంత్యక్రియలకు వచ్చేవి. ప్రస్తుతం ఈ శ్మశాన వాటికకు రోజుకు 5 నుంచి 10 వరకు మాత్రమే వస్తున్నాయి.  

లాకర్‌ గదుల్లోనే అస్థికలు

హిందూ సంప్రదాయంలో ఎవరైనా మృతి చెందితే వారిని దహనం చేశాక, అస్థికలను పది రోజులలోపు, లేదా ఒక నెల గానీ, మూడు మాసాల్లోపు గానీ పవిత్ర నదుల్లో కలపాలి. అప్పటి వరకు వాటిని శ్మశానవాటిక పక్కనే ఉన్న లాకర్‌ గదుల్లో భద్రపరుస్తారు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో మరణించిన తమ కుటుంబ సభ్యుల అస్థికలు కూడా కృష్ణా, గోదావరి, గంగ, యమునా లాంటి పుణ్యనదుల్లో కలపడానికి అవకాశం లేకపోవడంతో రెండు నెలలుగా ఇక్కడే భద్రపరుస్తున్నామని శ్మశానవాటిక నిర్వాహకులు తెలిపారు. 


logo