చలితీవ్రత, వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా నగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో గత పది రోజులుగా గ్రేటర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ముఖ్యంగా జలుబు, దగ్గు, తల నొప్పి, జ్వరం వంటి లక్షణాలతో రోగులు దవాఖానల వద్ద క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ సర్వసాధారణమే అని.. అయితే చలి ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులకు న్యుమోనియా ప్రమాదం పొంచి ఉంటుందని.. ఐదేళ్ల వయస్సులోపు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
– సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ)
సాధారణంగా చలికాలంలో వైరస్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది. చల్లదనం వల్ల ఎక్కువగా ఫ్లూ కేసులు అంటే జలుబు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు వైరల్ ఫీవర్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయంటున్నారు. ఫలితంగా బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానాలు, జిల్లా దవాఖానలతో పాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్లో రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానలో సైతం ఈ లక్షణాలతో కూడిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి.గత వారం పది రోజులుగా వైరల్ ఫీవర్ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగుల రద్దీ సాధారణం కంటే 20 శాతం వరకు పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు.
వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా నగరంలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణమే. గడిచిన వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో రోగులు వస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చికిత్స తీసుకోవడంతో పాటు 2-3 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే వెంటనే కోలుకునే అవకాశం ఉంది.
దవాఖాన పేరు పెరిగిన ఓపీ సంఖ్య లక్షణాలు
బస్తీ దవాఖానలు 10-20శాతం గొంతునొప్పి, ఒంటి నొప్పులు, తలనొప్పి, జలుబు,దగ్గు, జ్వరం, పీహెచ్సీ, యూపీహెచ్సీ,
సీహెచ్సీలు 15-20శాతం జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, తలనొప్పి
ఫీవర్ హాస్పిటల్ 20-25శాతం జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం,ఒంటి నొప్పులు
ఉస్మానియా 20-30శాతం జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు
గాంధీ 10-20శాతం జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, తలనొప్పి