మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 04, 2020 , 01:19:34

సిటీ.. వెరీ సేఫ్‌

సిటీ.. వెరీ సేఫ్‌

కేసుల నమోదు 0.1 శాతమే

వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే కరోనా

మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే పకడ్బందీగా కట్టడి 

కోలుకునే వరకు చికిత్సనందిస్తున్న వైద్యసిబ్బంది

భయం వీడుదాం..బాధ్యతగా నడుచుకుందాం

మనం అజాగ్రత్తగా ఉంటే 

పల్లె..పట్నం ఏదీ సురక్షితం కాదు

తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉందాం

‘ఇందుగలడందులేడని సందేహంబు వలదు’ అన్నట్లు కరోనా వ్యాపించని నగరం లేదు. అది సోకని పట్టణమూ లేదు. ఊరూవాడ అన్నతేడా లేకుండా విజృంభిస్తూనే ఉన్నది. పిల్లాజెల్లా ముసలీముతకా అన్న తేడాలు లేకుండా అంటుకుంటూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెల్లో, నగరాల్లో ఏది సురక్షితమన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉండడం సురక్షితం కాదని, నగరాన్ని విడిచిపోవడం మేలని కొందరు అబద్ధాలను పోగుచేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. 

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

జయిస్తున్నవారే అధికం

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. వైరస్‌ను జయిస్తున్నవారే అధికంగా ఉంటున్నారు. చికిత్స తీసుకుని బయటికి వచ్చి డాక్టర్లు, వారందించిన సేవలను పొగుడుతున్నారు. పైగా ఇక్కడ మరణాల రేటు తక్కువగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదని నిపుణులు అంటున్నారు.

కేసుల నమోదు 0.1 శాతమే

హైదరాబాద్‌ జనాభా కోటిన్నర. ఇక్కడున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14 వేల లోపే. అంటే 0.1 శాతమే. వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే కరోనా సోకింది. ఇంత జనాభా నివసిస్తున్న నగరంలో అన్ని తక్కువ కేసులంటే సురక్షితం కాదని అనుకోవడం తప్పవుతుందని విద్యావేత్తలు అంటున్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపుల తర్వాత సొంతూర్లకు వెళ్లాలన్న అతృతతో చాలా మంది గ్రామాలకు తరలారు. తల్లిదండ్రులు, బంధువుల మధ్య గడపాలని కొందరు, ఉపాధి కరువై మరికొందరు, అద్దెలు కట్టలేక  ఇంకొందరు వెళ్లారు. అంతేకాని సురక్షితంగా ఉండలేమని మాత్రం కాదన్న విషయాన్ని అంగీకరించాల్సిందే.

కోలుకునే వరకు చికిత్స

కరోనా వైరస్‌ను అరికట్టడంలో, బాధితులకు చికిత్సనందించడంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత చొరవ చూపిస్తున్నది. వైద్య సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీపడటం లేదు. అత్యంత జాగ్రత్తగా క్వారంటైన్‌, ఐసొలేషన్‌ కేంద్రాలకు తీసుకెళ్లి కోలుకునే వరకు చికిత్సనందిస్తున్నది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా బాధితుల ఫోన్‌ నంబర్లు తీసుకోవడం, ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ పర్యవేక్షణ జరుపుతున్నారు. కరోనా సోకిన ప్రాంతాల్లో  జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేయడం, వైద్యారోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు  ఇంటింటికీ తిరుగుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.

కరోనా కట్టడిలో ముందున్నాం

కరోనా కట్టడిలో మనమే ముందున్నాం. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే నగరంలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉంది. జనతా కర్ఫ్యూ, అనంతరం లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అన్ని రకాల  చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికులను వారి స్వరాష్ర్టాలకు పంపించడం కోసం ఒకే రోజు 40 రైళ్లను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు, లాక్‌డౌన్‌లో వారికి కల్పించిన సౌకర్యాల విషయాలను ప్రతి రోజూ ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారు ప్రస్తావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రధాన పట్టణాలతో పోలిస్తే చాలా తక్కువగా హైదరాబాద్‌లో కేసులు, మరణాల సంఖ్య ఉంది. ప్రజలు ధైర్యంగా ఉండాలి. పుకార్లను నమ్మొద్దు.

- అంజనీకుమార్‌, నగర పోలీస్‌ కమిషనర్‌

పుకార్లు నమ్మకండి

అనవసరంగా కంగారు పడొద్దు. కరోనా సోకని పట్టణం, నగరం లేదు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండొచ్చు. శాస్త్రీయ అవగాహన లేని వారు, సామాజిక అవగాహన లోపించిన వారు సోషల్‌ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దేశంలోని అన్ని మెట్రోపాలిటన్‌ సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చాలా చాలా తక్కువ. నగరవాసులందరికీ జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది, వైద్యులు నిరంతరం సేవలందిస్తూనే ఉన్నారు. ఆపత్కాలంతో ఐకమత్యంగా ఉండి కరోనాను పారదోలుదాం. అంతేకానీ పుకార్లు సృష్టించుకొని మనకు మనమే నష్టం కలిగించుకోవద్దు. 

-విశ్వనాథ్‌ చెన్నప్ప సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ 

అవి కరోనా వలసలు కావు

కేసులు పెరిగినప్పటికీ, మిగిలిన నగరాలతో పోలిస్తే తక్కువ. మరణాలు రేటు చాలా తక్కువగా ఉంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు, సామాజిక దూరం తదితర చర్యలు తీసుకోవాలి. కేసుల్లో చాలా మంది బాగవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రజలు తరలివెళ్తున్నారనే ప్రచారం సరికాదు. కొంత మంది వెళ్తున్నప్పటికీ, వీళ్ల ద్వారా వారి స్వస్థలాల్లో కూడా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. లాక్‌డౌన్‌ విధిస్తున్నారనే ప్రచారంతో జరిగిన వలసలుగానే భావించాలి తప్ప కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన వాటిగా భావించకూడదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వయోవృద్ధులు, చిన్నారుల విషయంలో తప్పించి, మిగిలిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారు. 

-ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం, మాజీ వీసీ, ఓయూ

సురక్షితం కాదనుకోవడం అవివేకమే

ప్రపంచంలో ఎక్కడా ఉన్నా రిస్క్‌లో ఉన్నట్లే. కరోనా ప్రబలుతున్న తరుణంలో రాకపోకలకు స్వస్తిచెప్పి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఒక్క మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారు మాత్రమే రాకపోకలు సాగించాలి. మాస్క్‌, శానిటైజేషన్‌, వ్యక్తిగత పరిశుభ్రత అతి ముఖ్యం. అతిథులను పిలవడం, మాట్లాడటం చేయొద్దు. ఊర్ల కంటే హైదరాబాద్‌లో అధునాతన వైద్య సదుపాయాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలు అందరికీ సేవలందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిటీ సురక్షితం కాదనుకోవడం అవివేకమే అవుతుంది.  -ప్రొ. సురేశ్‌ కుమార్‌ (ఇఫ్లూ వైస్‌ఛాన్స్‌లర్‌)

జాగ్రత్తను మించిన వైద్యం లేదు

కేసుల సంఖ్య ఎక్కువ కనపడుతున్నందు వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ సహా అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాన్నింటిలోనూ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. వ్యాక్సిన్‌ వచ్చే వరకు అందరం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే. క్రమశిక్షణ గల జీవితాన్ని అలవాటు చేసుకోవడాన్ని మించిన వైద్యం మరొకటి లేదు. వైరస్‌ వ్యాప్తికి ఎవరిని బాధ్యుల్ని చేయలేం. 

-మఠం శంకర్‌ (సహార స్వచ్ఛంద హెడ్‌)

వాస్తవాలు గ్రహించి అవగాహన పెంచుకోవాలి 

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.అన్నిరాష్ర్టాల కంటే మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచాలి. అవగాహన పెంచుకొని, జాగ్రత్తలు పాటిస్తే సడలింపులు ఇచ్చినా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదు. హైదరాబాద్‌ నగరం ప్రమాదంలో ఉందనే దుష్ప్రచారం తగదు.నగరం ప్రమాదంలో ఉన్నదనో, ఆరోగ్య భద్రత లేదనో అని భావించడం సరైనది కాదు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఇతర ప్రాంతాలలో పరీక్షల సదుపాయాలు ఎక్కువగా ఉండవు. హైదరాబాద్‌ నగరంలోనే అత్యాధునికమైన సదుపాయాలు ఉన్నాయి.నగర ప్రజలు గాబరా పడటం సరికాదు. వాస్తవాలు తెలుసుకొని వ్యవహరించాలి. 

- టంకశాల అశోక్‌, ప్రభుత్వ సలహాదారు

వ్యక్తిగత జాగ్రత్తలే కాపాడుతాయి

కరోనా మహమ్మారి అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్న నగరాలలో ఎక్కువగా ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ వంటి మిగిలిన ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువే. లాక్‌డౌన్‌ తర్వాత పాజిటివ్‌ కేసులు పెరిగినప్పటికీ, దేశ సగటుతో పోలిస్తే చాలా స్వల్పం. ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేవు. ఎవరో కొంత మంది చేసిన పొరపాట్లకు ఎక్కువ మంది బలయ్యే అవకాశం ఉంది. ‘హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతోంది’ అనే ప్రచారం అబద్ధం. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందనే ప్రచారంతో కొంతమంది స్వస్థలాలకు వెళ్లినప్పటికీ, పూర్తిగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లినట్లు ప్రచారం చేయడం సరికాదు.  

- ప్రొఫెసర్‌ ఎస్‌. సత్యనారాయణ, మాజీ వీసీ, ఓయూ

దుష్ప్రచారం సరికాదు

మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉంది. గాంధీలో చికిత్స అద్భుతంగా చేస్తున్నారు. ఎంతో మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇండ్లకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. ఉపాధి కోల్పోయి, ఇంటి కిరాయిలు కట్టలేక కొంత మంది తాత్కాలికంగా ఊళ్లకు వెళ్లిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల కారణంగా చెరువులు నిండాయి. దీంతో గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేందుకు కొంత మంది వెళ్తున్నారు. అంతే కానీ  హైదరాబాద్‌లో బతకలేకే వెళ్తున్నారనే దుష్ప్రచారం సరికాదు. ఈ వెళ్లడం కూడా తాత్కాలికమే కానీ శాశ్వతమైంది కాదనేది గుర్తుంచుకోవాలి. 

- ప్రొ. నాయుడు అశోక్‌, డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఓయూ

ఊర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు  

హైదరాబాద్‌ డేంజర్‌ జోన్‌లో ఏమీ లేదు. ఊర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు.పరిస్థితులు చక్కబడే వరకు ఎక్కడికీ వెళ్లకుండా ఇండ్లల్లోనే ఉండటం ఉత్తమం. వెళుతున్నవారంతా సురక్షితం కాదని పోతున్నారని నేను అనుకోవడం లేదు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో గడపాలని, పిల్లలకు సెలవులు ఉండటం, ఎక్కడున్నా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే అవకాశంఉండటంతో వెళుతున్నారని అనుకుంటున్నాను. వెళ్లే వారు ఆరోగ్యవంతులైతేనే వెళ్లడం ఉత్తమం. అనారోగ్యం బారినపడి గ్రామాలకు వెళితే అక్కడివాళ్లకు అంటించినవాళ్లమవుతాం. ఒక వేళ ఊర్లో ఉన్నప్పుడు కరోనా సోకిందనుకోండి.. హైదరాబాద్‌లో ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. ఊర్లో ఉన్నప్పుడు కరోనా సోకినా వైద్యం కోసం మళ్లీ హైదరాబాద్‌కు రావాల్సిందే. అందువల్ల ఇలాంటి ప్రచారాలకు దూరం ఉంటే బెటర్‌.

- ప్రొ. లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ


logo