KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ కసంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ. 4 వేల కోట్లతో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ ఎస్టీపీని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇండియాలోనే 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్‌ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కూకట్పల్లి ఫతేనగర్‌లో ఏర్పాటు చేసిన 133 ఎంఎల్డీల ఎస్టీపీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది. ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమే.. ఉప్పల్ నల్ల చెరువు, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేస్తున్న ఎస్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీలోకి వెళ్తుంది. 94 శాతం స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మూసీ శుద్ధి ఎందుకు..? కొత్తగా మీరు శుద్ధి చేసేదేమీ లేదు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. సీఎం రూ. లక్షా 50 వేల కోట్లు అని అంటడు. మంత్రులేమో రూ. 50 వేల కోట్లు, ఇంకొందరేమో రూ. 70 వేల కోట్లు అని మాట్లాడుతున్నారు. ఈ మాటలను చూస్తుంటే అనుమానం వస్తుంది. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు అని గతంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడారు. నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి భట్టికి డబుల్ బెడ్రూం ఇండ్లు చూపించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 12 వేల ఆక్రమణలు ఉన్నాయని సీఎం చెప్పారు. వాటిని తొలగించి బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. మేం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టకపోతే మీరు ఎక్కడ్నుంచి ఇస్తున్నారు..? ఇప్పటిదాకా మీరు చెప్పినవి అబద్దాలు అని తేలిపోయింది. కేసీఆర్ చేసిన మంచి పనని ఒప్పుకోక తప్పట్లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో 14 వేల ఎకరాలు ఫార్మా సిటీ కోసం సేకరిస్తే దాన్ని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటి అని రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణ పేరిట కొత్త నాటకాలు ఆడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి. రైతుభరోసా అందించండి.. పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు మేం చేసిన పని బాగా తెలుసు. లింకు రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, స్మశాన వాటికలు, లైబ్రరీలు కట్టాం. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
మూసీ సుందీకరణ పేరుతో కుంభకోణం జరుగుతంది. దాన్ని కూడా బయటకు తీస్తాం. పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలను గమనిస్తున్నారు. భవిష్యత్‌లో అన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకువస్తాం. పేదలకు ఒక న్యాయం.. పేదోళ్లకు ఒక న్యాయం ఉంది. పేదోళ్లను బుల్డోజర్ల కింద నలిపేస్తున్నారు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించండి.. ఆలస్యం చేయకండి. పుస్తకాల కోసం వేద శ్రీ మాట్లాడిన మాటలు వింటే గుండె బరువెక్కిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Wine Shops | శుక్ర, శనివారాలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు ఓపెన్
Hyderabad | హైదరాబాద్ జంట జలాశయాలకు పోటెత్తిన వరద.. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తివేత
KTR | సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు.. కేటీఆర్ ఎద్దేవా