మరింత విశాలంగా..బంజారాహిల్స్ రోడ్ నం. 12

- విరంచి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్చెక్పోస్టు వరకు రహదారి విస్తరణ
- 306 ఆస్తుల సేకరణలో బల్దియా
బంజారాహిల్స్ రోడ్ నం. 12...గ్రేటర్లోని వీవీఐపీ, వీఐపీ మార్గాల్లో ఇదో ముఖ్యమైన మార్గం..మంత్రుల క్వార్టర్స్, ఎమ్యెల్యే కాలనీ, కమాండ్ కంట్రోల్ రూం, ప్రముఖుల నివాసాలు ఉండే ఈ మార్గంలో నిత్యం సందడిగా ఉంటుంది. వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు, భారీ భవనాలు వెరసి ఈ రూట్.. అత్యంత ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఇరుకుగా మారిన ఈ రహదారిని విస్తరించాలని ట్రాఫిక్ విభాగం జీహెచ్ఎంసీకి ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 విరంచి ఆస్పత్రి నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 30, 36 మీటర్ల మేర (100, 120 అడుగుల) రహదారి విస్తరణకు.. 306 ఆస్తులను సేకరించే ప్రతిపాదనలకు ఇటీవల స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రహదారి విస్తరణ పనులు, ఆస్తులు సేకరించే అంశాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. అధికారులు ఇప్పటికే సర్వే పనులు మొదలు పెట్టారు.