Hyderabad | హైదరాబాద్ : మళ్లీ నీకు ఆడపిల్లే పుడుతుంది.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో.. అని ఓ నిండు గర్భిణిని అర్ధరాత్రి వేళ బయటకు గెంటేశాడు ఓ భర్త. తన ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డ భార్య.. తన భర్త వ్యవహార శైలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో బుధవారం ఉదయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్‌కు చెందిన అక్బర్ ఖాన్‌కు హుమెరాతో కొన్నేండ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లైంది. ఈ దంపతులకు తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. ఆడబిడ్డ పుట్టడంతో.. భర్త అక్బర్ భార్యను వేధింపులకు గురి చేశాడు. అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశాడు. పుట్టింటికి పంపించాడు. అల్లుడి డిమాండ్ మేరకు హుమోరా తల్లిదండ్రులు అడిగినంత కట్నం మళ్లీ అప్పజెప్పారు.
డిమాండ్ మేరకు కట్నం రావడంతో.. అక్బర్ ఖాన్ తన భార్యతో కొన్నాళ్లు మంచిగానే ఉన్నాడు. అంతలోనే ఆమె రెండోసారి గర్భం దాల్చింది. రెండో కాన్పులో కూడా మళ్లీ ఆడశిశువే జన్మించింది. ఈసారి అక్బర్ తనలో ఉన్న రాక్షసాత్వాన్ని బయటపెట్టాడు. తనకు మగబిడ్డ కావాలని భార్యను వేధించాడు. ఇద్దరు పిల్లలను, ఆమెను పలుమార్లు ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. మరింత కట్నం తీసుకురావాలని కొట్టేవాడు. దీంతో అక్బర్ వేధింపులు భరించలేక రైన్ బజార్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు రాజేంద్రనగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
మూడోసారి గర్భవతైన హుమెరాను ఆరు నెలల క్రితం మళ్లీ పుట్టింటికి పంపించాడు. కొన్నిరోజుల కిందట మళ్లీ ఆమె అత్తగారింటికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ‘మళ్లీ నీకు ఆడపిల్లే పుడుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో’ అంటూ అర్ధరాత్రి నిండు గర్భిణిని, ఇద్దరు చిన్నారులను బయటకు గెంటేసాడు అక్బర్. తనకు న్యాయం చేయాలంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆడపిల్లలు పుట్టినందుకు తనను వేధిస్తున్న తన భర్త అక్బర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది హుమెరా.
ఇవి కూడా చదవండి..
MLA Marri | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
Hyderabad | కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి
Hyderabad | గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.. 9 మంది అరెస్ట్