రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : అన్నదాతలపై కాంగ్రెస్ సర్కారు మొండివైఖరి అనుసరిస్తున్నది. తాము పండించిన ధాన్యానికి రావల్సిన కోట్లాది రూపాయల బకాయిలు సకాలంలో రాకపోవడంతో అప్పులపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఓవై పు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక.. అప్పులు చేసి పంటలు సాగు చేసి.. కొను గోలు కేంద్రాల్లో విక్రయించి నెలలు దాటినా డబ్బులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి సన్న వడ్లను సేకరించింది. వాటిని సంబంధించిన బోనస్ డబ్బులు దాదాపుగా రూ. 6.53 కోట్లు ఇప్పటివరకు విడుదలే కాలేదు. వాటి కోసం జిల్లాలో సుమారు 12వేల మందికి పైగా రైతులు గత ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఈ వానకాలంలోనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 14,860 టన్నుల సన్న ధాన్యాన్ని సేకరించినా వాటికి సంబంధించిన డబ్బులు.. బోనస్ బకాయిలు ఇంకా రాకపోవ డంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.22 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. తలకొండపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట, ఫారుక్‌నగర్, చౌదరిగూడ వంటి మండలాల్లో ప్రభుత్వం ఆరు కొనుగోలు కేంద్రాల ద్వారా 34 వేల మె ట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఇంకా రైతులకు రూ.22 కోట్లు రైతులకు రావల్సి ఉన్నాయి.
మొక్కజొన్న పంటను వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి సాగు చేశా. సర్వేనంబర్లు 636లో ఎకరం, 685లో 3.10 ఎకరాల్లో సాగు చేసి.. డిసెంబర్ 8న 110 క్వింటాళ్ల పంటను మార్క్‌ఫెడ్‌కు విక్రయించగా రూ. 2.65,200 చెల్లించనున్నట్లు రసీదు ఇచ్చారు. రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ డబ్బులు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. తెచ్చిన డబ్బులకు వడ్డీ చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నా. అధికారులు స్పందించి బకాయి ఉన్న డబ్బులను వెంటనే విడుదల చేయాలి.
– కొప్పు కృష్ణ, రైతు, కేశంపేట
మూడు నెలలు కావస్తున్నా నేటికీ డబ్బులు మాత్రం నా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. నాకున్న ఎకరం భూమితోపాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని మూడెకరాల్లో మొక్కజొన్నను సాగు చేశా. పంటను దళారులకు విక్రయించొద్దని.. పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ లలో విక్రయిస్తే వారం రోజుల్లో నగదు మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అక్కడ విక్రయించా. మూడు నెలలు కావస్తున్నా రూ.1.91,800 నగదు నేటికీ రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నా.
– తిమ్మగళ్ల మత్తు, రైతు, కేశంపేట