గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:27:41

పన్ను వసూలు ముమ్మరం

పన్ను వసూలు ముమ్మరం

ఖైరతాబాద్‌, జనవరి 23: విశ్వనగరాభివృద్ధిలో జీహెచ్‌ఎంసీది కీలక భూమిక. ప్రతి ఏడాది ఆస్తి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. గత ఏడా ది కొవిడ్‌ నేపథ్యంలోనూ పన్ను చెల్లింపు రికార్డు స్థాయిలో జరిగింది. బల్దియాలో కీలకంగా ఉన్న ఖైరతాబాద్‌ సర్కిల్‌-17 పరిధిలో అధికార యం త్రాంగం, కీలకమైన ప్రభుత్వ కా ర్యాలయాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, మల్టీప్లెక్స్‌లు, సూపర్‌, మల్టీ స్పెషాలిటీ దవాఖానలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు పన్ను చెల్లింపు ద్వారా జీహెచ్‌ఎంసీకి సమకూరుతున్నాయి. తొమ్మిది నెలల కాలంలోనే 74.09 శాతం ఆస్తి పన్ను రావడం విశేషం. 

2019-2020 వార్షిక సంవత్సరంలో రూ. 126.23 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది 62,520 అసెస్‌మెంట్లకు గాను రూ.157.78 కోట్లకు గాను, నిర్ణీత గడువులోగానే తొమ్మిది నెలల్లో సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్‌, మీసేవా, బిల్‌ కలెక్టర్ల ద్వారా రూ. 116.81 కోట్లు పన్నుల చెల్లింపుల రూపంలో వచ్చాయి. ఇంకా రూ.41. 09కోట్లు రావాల్సి ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 23 నాటికి రూ.5.99 కోట్లు వచ్చాయి. మార్చి 31 నాటికి తమకు విధించిన టార్గెట్‌ను దాటుతామని సర్కిల్‌-17 డిప్యూటీ కమిషనర్‌ బి. వంశీకృష్ణ తెలిపారు. 

నేటి నుంచి పన్ను పరిష్కార వేదిక

ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో నేటి నుంచి మార్చి 31 వరకు పది ఆదివారాల పాటు ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. కొత్త అసెస్‌మెంట్లు, మ్యుటేషన్‌, రివిజన్‌ పిటీషన్‌ (ప్లింత్‌ ఏరియా వేరియేషన్‌, యుసేజ్‌, వేరియేషన్‌ ఇన్‌ ప్లింత్‌ ఏరియా, జోన్‌/సబ్‌ జోన్‌ వేరియేషన్‌, రిమూవల్‌ ఆఫ్‌ యూసీ పెనాల్టీ), వెకెన్సీ రెమిషన్‌, డేటాబేస్‌లో పేరు, డోర్‌ నంబరు కరెక్షన్స్‌, డిమాండ్‌ కరెక్షన్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌లో మినహాయింపులు, డబుల్‌ పీటీఐఎన్‌ డిలీషన్‌, కోర్టు కేసు తదితర అంశాల్లో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బల్దియా అధికారులు కోరారు.

VIDEOS

logo