శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 20, 2020 , 03:16:25

యూటర్న్‌ తీసుకున్నాడు... రూ.92 లక్షలతో ఉడాయించాడు..

యూటర్న్‌ తీసుకున్నాడు... రూ.92 లక్షలతో  ఉడాయించాడు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒకే ఒక్క పెద్ద జాక్‌పాట్‌ కొట్టాలి...ఊర్లో ఇల్లు నిర్మించుకోవాలి..  విలాసవంతంగా బతకాలి.. దీని కోసం ఆరు నెలలుగా అవకాశం కోసం ఎదురుచూపు... డ్రైవర్‌గా చేరి బ్యాం కు డబ్బు దోచేయాలని ప్లాన్‌...ఇందులో భాగంగా యూ టర్న్‌ తీసుకుంటానని ఏటీఎం కేంద్రాల్లో నగదును డిపాజిట్‌ చేసే వ్యాన్‌తో ఉడాయించాడు... మొత్తం రూ.92లక్షలు కొట్టేశాడు... అయితే కేసును సవాల్‌గా తీసుకున్న  హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. సీసీ కెమెరాలు....గుడ్‌ సిటిజన్స్‌ సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని .. రూ.90 లక్షలను స్వాధీనం చేసుకున్నా రు. గురువారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. 

 సీఎంఎస్‌ సంస్థ మేనేజర్‌ పూజాలా హరీశ్‌కు...ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కేంద్రాల్లో నగదును డిపాజిట్‌ చేసే ఒప్పందం ఉంది.   ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం నుంచి రూ.1.60 కోట్లు తీసుకుని డ్రైవర్‌ రాకేశ్‌, ఇద్దరు గన్‌మెన్‌లు, కస్టోడియన్‌లు సీఎంఎస్‌కు చెందిన బొలెరో వాహనంలో బయలు దేరారు. మధ్యాహ్నం చిలకలగూడ ప్రాంతానికి చేరుకుని.. అక్కడ రూ.68 లక్షలు తీసుకుని గన్‌మెన్‌, కస్టోడియన్‌లు ఏటీఎం కేంద్రంలో పెట్టేందుకు వెళ్లా రు. ఇంతలో రాకేశ్‌ వాహనాన్ని యూ టర్న్‌ చేసుకుని వస్తానని చెప్పి.. రూ.92 లక్షలతో ఉడాయించాడు. డబ్బులు తీసుకుని.. వాహనాన్ని లాలాగూడ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సీఎంఎస్‌ మేనేజర్‌ హరీశ్‌ చిలకలగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసు లు.. ముందుగా సీసీ కెమెరాల ద్వారా బొలెరో వాహన వెళ్లిన వివరాలను మ్యాపింగ్‌ చేశారు . దాదాపు 36 గంట ల్లో చిలకలగూడ నుంచి నాగోలు వరకు  500 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో అనుమానితుడు రాకేశ్‌ లాలాగూడలో వాహనాన్ని వదిలేసి... రెండు బ్యాగులతో ఆటో ఎక్కాడని తేలింది. ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్‌.. రాకేశ్‌ నాగోలు దిగాడని చెప్పాడు. అలా నాగోలు ప్రాంతంలో దాదాపు అన్ని ఇండ్ల వద్ద సమాచారాన్ని సేకరించారు. చివరకు డ్రైవర్‌ రాకేశ్‌ అద్దెకు ఉంటున్న ఇంటికి చేరారు. అక్కడ మాటు వేసి.. డబ్బులు తీసుకునేందుకు వచ్చిన రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

విచారణలో.. రాకేశ్‌ అసలుపేరు .. దొండపాటి ప్రకాశ్‌గా తేలింది. ఆంధ్రప్రదేశ్‌ నిడిదవోలు గ్రామానికి చెందిన ప్రకాశ్‌ పాలిటెక్నిక్‌ చదివాడు. ఆ తర్వాత పలు చోట్ల సైట్‌ మేనేజర్‌గా పనిచేశాడు. 2014లో వివాహం చేసుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలని కోరిక.. విలాసవంతంగా బతకాలనే ఆశతో... ఎలాగైన బ్యాంకు నగదును దోచేయాలని స్కెచ్‌ వేసుకున్నాడు. దీని కోసం 2017లో తన మకాన్ని హైదరాబాద్‌ నాగోలు సాయినగర్‌కు మార్చాడు. ఇంట్లో సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని నమ్మించి.. బయట డబ్బు దో చేందుకు పథకం రచించాడు. 2019 ఆగస్టులో కవాడిగూడలోని ఫైవ్‌స్టార్‌ ఫెసిలిటీ సొల్యూషన్స్‌ ద్వారా సెక్యూరిట్రన్స్‌ ఇండియా సంస్థలో డ్రైవర్‌గా చేరాడు. అలా  బ్యాంకుల చెందిన ఏటీఎం కేంద్రాల్లో నగదును తరలించే వ్యాన్‌కు డ్రైవర్‌గా వెళ్లాడు. ఇలా వెళ్తున్న ప్రతిసారి.. ఆరు నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నా డు. చివరకు ఈ నెల 16న సీఎంఎస్‌ వాహనానికి డ్రైవర్‌గా వెళ్లా డు.  ఆ వాహనంలో సీఎంఎస్‌ సంస్థ ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన 1.60 కోట్లు తీసుకుని బయులుదేరారు. చిలకలగూడకు చేరిన తర్వాత... అతను యూటర్న్‌ తీసుకుంటానని వాహనంతో ఉడాయించాడు. ఈ కేసు ఛేదనలో సహకరించిన ఆటో డ్రైవర్‌, సాయినగర్‌ కాలనీ వాసులను సీపీ అభినందించా రు. నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు బృందాన్ని సీపీ ప్రశంసించారు.


logo