రవీంద్రభారతి,నవంబర్22: అందెశ్రీ నాకు అత్యంత అప్తుడు.. నా మనస్సుకు దగ్గరివాడని.. అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శించేవారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డా.అందెశ్రీ సంతాప సభ శనివారం రవీంద్రభారతిలోని మెయిన్‌హాల్‌లో నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సభా అధ్యక్షతన జరిగిన అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, గద్దర్ వెన్నల, తదితరులు పాల్గొని అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గుండెకు జయ జయహో తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించా మన్నారు. ఇప్పుడు తెలంగాణ నాలుగుకోట్ల ప్రజలు జయ జయహో తెలంగాణ పాటను నిత్యం పాడుకుంటున్నారని తెలిపారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా భాధ్యత అన్నారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందెశ్రీ స్ఫూర్తి భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఆయన పుస్తకాలు ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. \
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది కవులకు 300 గజాల ఇంటి స్థలం ఇచ్చాం..భారత్ ప్యూచర్సిటీలో వారికి ఇంటిని నిర్మిస్తామన్నారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేన న్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని అన్నారు. కవులు ఎంతోమంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సూర్యం, భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, అందెశ్రీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.