హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఆయన శనివారం స్పందించారు. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే సీఎం రేవంత్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, మరో లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ, వేల కోట్లతో అకరకు రా ని చోట ఆరు లైన్ల రోడ్లు, కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ ఛానెల్లో పెట్టి క్లియర్ చేయొచ్చు.. కానీ, కమీషన్లు రావని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం విడుదల చేయవు’ అని నిప్పులు చెరిగారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు మీరిచ్చే గౌరవం ఇదేనా?
30ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సర్వీసులో ఉన్నప్పుడు వారు దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా వేధిస్తుండటం అమానవీయం, అనైతికమని మండిపడ్డారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
10వేల కోట్ల బకాయిలా?
విశ్రాంత ఉద్యోగులకు రూ.10వేల కోట్లు బకాయి లు పెట్టిన ఘనత నీకే దకింది రేవంత్‌రెడ్డి.. అని ఎద్దేవా చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు, 5 డీఏల జాడే లేనేలేదని, సీపీఎస్ రద్దు పై నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రతినెలా ఒకటో తేదీనాడే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి విఫలమయ్యారన్నారు. మూడు నెలలుగా జీతాలు రాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.