హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు. ప్లాంట్ల ఏర్పాటుకు నాబార్డు నిధులున్నా సర్కారు పట్టించుకోలేదు. కేవలం టెండర్ ప్రక్రియను పూర్తిచేయకపోవడంతో ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాపీగా రెండేండ్ల తర్వాత మేల్కొన్న సర్కారు టెండర్ల ఖరారుకు ఓ కమిటీని వేసింది.
బీఆర్ఎస్ హయాంలోనే..
వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. 2023 ఆగస్టు నాటికి 1,521 బడులపై సోలార్ ప్యానళ్లను సర్కారు ఏర్పాటు చేసింది. 2022లోనే టెండర్లు పూర్తిచేసి 2023 కల్లా ప్లాంట్లను బిగించింది. గ్రిడ్‌తో అనుసంధానించింది. తద్వారా విద్యుత్తు బిల్లులు జీరో అయ్యాయి. ఈ నేపథ్యంలో మిగతా బడుల్లోనూ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 9,937 స్కూళ్లపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. రూ. 289 కోట్లను నాబార్డు నుంచి రుణంగా పొందేందుకు ప్రక్రియను కూడా పూర్తిచేసింది. టెండర్లను చేపట్టే క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు సోలార్ స్కూళ్ల స్కీమ్‌ను పూర్తిగా పక్కనపెట్టింది. రెండేండ్లు కాలయాపన చేసింది. ప్రతిపాదనలు సర్కారుకు చేరగా పెండింగ్‌లో పెట్టింది. ఎట్టకేలకు తాజాగా టెండర్ల ఖరారుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
పని బీఆర్ఎస్ది..పబ్లిసిటీ కాంగ్రెస్‌ది
మంది బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ సర్కారు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను మేమే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నది. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నది.. ఇప్పుడేమో సోలార్ప్యానళ్లు అంటూ మరోసారి పబ్లిసిటీ మొదలుపెట్టింది. ఉచిత విద్యుత్తు అన్నారు. రెండేండ్లు పక్కనపెట్టారు. ఇప్పుడేమో అంతా చేసినట్టు చెబుతున్నారు.
– వై సతీశ్‌రెడ్డి,టీజీ రెడ్కో మాజీ చైర్మన్