సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం మొదలు.. సంపద సృష్టిని గాలికివదిలేసి విలువైన ప్రజాభూములను అంగట్లో పెట్టి నిబంధనలు తుంగలో తొక్కిమరీ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కోకాపేట సహా పలు విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసిన సర్కార్.. తాజాగా మరోసారి భూముల వేలానికి సమాయత్తమవుతోంది. ఈమేరకు కోకాపేట్, మూసాపేట్‌లోని దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.
ఒక్క కోకాపేట్ భూములపైనే రూ. 5వేల కోట్ల ఆశలు పెట్టుకోగా, మూసాపేట్‌లోని 15.22 ఎకరాల భూమిపై మరో రూ.2వేల కోట్లు రాబట్టాలని ఆశగా ఎదురుచూస్తోంది. ఒక్కో ప్లాట్‌పై 30శాతం అధిక ఆప్సెట్ ధరను నిర్ణయించిన సర్కార్.. వీటిపై వచ్చే రెవెన్యూతో హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులను పట్టాలెక్కించాలని చూస్తోంది. ఈ క్రమంలో నాలుగు దశల్లో భూములను విక్రయించనుండగా… సోమవారం ఉదయం 11గంటలకు కోకాపేట్‌లోని నియోపోలిస్ వెంచర్‌లోని 17, 18 ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించనుంది.
ప్రజలను మభ్యపెట్టే యత్నం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తన హయాంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నగరంలో భూముల వేలాన్ని నిర్వహించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిధుల కొరత వెంటాడుతుండటంతో.. ఎన్నికలపుడు ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చేందుకు భూముల వేలం ఒక్కటే మార్గం అని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది. భూముల వేలంతో వచ్చిన ఆమ్దానీతో సంక్షేమ పథకాలు అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ బ్యాంక్ క్రమంగా కరిగిపోతూనే ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో కోకాపేటకు మహర్దశ..
బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ చేసిన కోకాపేట్ నియోపోలిస్ ప్రాజెక్టు ద్వారా ఎకరం రూ.100 కోట్లకు విక్రయించి… అప్పట్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. అదే సమయంలో హైదరాబాద్ రియాల్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముంబై తర్వాత ఎకరం వంద కోట్లకు విక్రయించి రికార్డు సృష్టించింది. కానీ ఏనాడు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా అప్పటి సర్కార్ చూడలేదు. భూముల పరపతి పెంచడమే ఉద్దేశ్యంగా వేలం నిర్వహించి, అంతర్జాతీయ స్థాయి కంపెనీల దృష్టిలో సిటీని నిలిపి నగరానికి కోకాపేట్ భూములతోపాటు ఐటీ కారిడార్ ప్రాంతాన్నీ హాట్ కేక్‌లా మార్చింది.
రూ.7వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా..
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ హామీల అమలుపేరుతో ప్రభుత్వభూములను అడ్డగోలుగా అమ్మకానికి పెడుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగా కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్, మూసాపేట్ భూములకు హెచ్ఎండీఏ నాలుగు దశల్లో వేలం నిర్వహించనుంది. నియోపోలిస్ లే అవుట్‌లోని నాలుగు ప్లాట్లకు నవంబర్ 24న, 28న, డిసెంబర్ 3న వేలం నిర్వహించనుంది. ఇందులో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లు ఉన్నాయి.
అదే విధంగా గోల్డెన్ మైల్‌లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్లో 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల చొప్పున ఉన్న రెండు సైట్లను హెచ్ఎండీఏ విక్రయించనుంది. వీటిలో కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి రూ.99కోట్లు, అదేవిధంగా గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట్ సైట్‌ను రూ.75 కోట్ల చొప్పున విక్రయించనుంది. వీటి ద్వారా మొత్తంగా రూ. 7వేల కోట్ల ఆదాయం రావాలనే లక్ష్యంతోనే గతం కంటే ఆప్సెట్ ధరను 30శాతం పెంచి, ఈ వేలాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తోంది. అయితే ఇలాంటి అడ్డగోలు అమ్మకాలపై పర్యావరణ వేత్తలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
