సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో కమీషన్ల వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చినికి చినికి ఇది గాలివానలా మారే ప్రమాదముందంటూ ప్రభుత్వ పెద్దలు కొందరు రంగంలోకి దిగినట్లు తెలిసింది. తిరుమలగిరి చెరువు సుందీరకరణకు హెచ్ఎండీఏ రూ.9.90 కోట్లతో చేపట్టిన టెండర్ల వెనుక షాడో సీఎం రంగ ప్రవేశం చేసి ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం.. సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి నా ఇలాఖాలో నీ పెత్తనమేంది? అంటూ షాడో సీఎంపై గరం అయ్యారంటూ ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో పూర్తి అంతర్గతంగా జరిగిన ఈ వ్యవహారరానికి సబంధించి విషయాలు బయటికి ఎలా పొక్కాయనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆరాతీయడంతో పాటు షాడో సీఎంతో కూడా మాట్లాడినట్లు సమాచారం.
అసలు కాంట్రాక్టు విలువ ఎంత? మధ్యవర్తికి సదరు కాంట్రాక్టర్ ఇచ్చిందెంత? ఎవరికెంత ముట్టాయి? అని కూలంకుశంగానే వివరాలు తెలుసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇకముందు వివాదాన్ని పెద్దది కాకుండా చూసుకోవాలని… ‘సింహ’భాగం షాడో సీఎం తీసుకున్నా, మిగిలినవారిని కూడా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. తలాయింత సర్దుకొని వివాదానికి తెర దింపాలని కాస్త గట్టిగానే సూచించినట్లు తెలుస్తున్నది. కాగా సాంకేతిక వివరాలు కూడా బయటికి ఎలా వచ్చాయనే దానిపైనా ఆరా తీశారు. సంబంధిత మహిళా ఇంజినీర్‌ను కూడా ఈ విషయంలో మందలించినట్లు చెబుతున్నారు. వివరాలు మీడియాకు ఎందుకు ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.