హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్, చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పోలీసుల అధికారిక ప్రెస్మీట్లో సినీప్రముఖులు కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధంలేని వాళ్లు సీపీ పక్కన కూర్చుంటే.. కేసు పరిష్కారంలో కష్టపడ్డ పోలీసులు వెనుక నిలబడతారా? ఇదంతా పోలీసుల ప్రతిష్ట దిగజార్చడం కాదా?’ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇమ్మడి రవిని అరెస్ట్ తర్వాత సీపీ సజ్జనార్… చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజుతోపాటు పలువురు సినీప్రముఖులను పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడమే ఈ చర్చకు దారితీసింది.
‘అసలు ఎప్పుడైనా బాధితులను ప్రెస్మీట్లో కూర్చోబెట్టి సీపీలు మాట్లాడారా? ఇప్పుడు ప్రెస్మీట్లో కూర్చున్నవారు నిజంగానే బాధితులా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా సజ్జనార్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీస్తున్నారు. నష్టపోయిన నిర్మాతల అభిప్రాయాలు ప్రెస్మీట్లో చెప్పిస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. సజ్జనార్‌కు రాజకీయ ఎజెండా ఉందని అందుకే సోషల్‌మీడియాలో హైలెట్ కావాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. సొంత ప్రచారం కోసం పోలీసుశాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో రెండేండ్లుగా నేరాలు పెరుగుతున్నాయని, కట్టడి కోసం చర్యలు తీసుకోవాల్సిన సీనియర్ అధికారులు సొంత ఇమేజ్ పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. సినీనటులను పక్కన కూర్చోబెట్టుకుని సజ్జనార్ నిర్వహించిన ప్రెస్‌మీట్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశారు. సజ్జనార్‌పై విచారణకు ఆదేశించాలని, పోలీసుశాఖ గౌరవాన్ని కాపాడాలని పేర్కొన్నారు.
పోలీసుశాఖ ప్రతిష్ఠకు సవాల్
రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం కలిగిస్తున్నాయి. సిటీ పోలీసులు వీఐపీల కోసమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎస్‌లు సొంత ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు కామెం ట్స్ చేస్తున్నారు. అధికారుల తీరు సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారు. అధికారుల తీరు రాజకీయనాయకుల పోకడలను మించిపోయిందని రిటైర్డ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే పైరసీ కేసును ఛేదించడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్స్ డీసీపీ కవితను, ఇతర పోలీసులను సీవీ ఆనం ద్ అభినందించారు. గతంలో కొందరు నిందితులను పట్టుకున్నప్పటి ప్రెస్‌మీట్ వీడియో రీట్వీట్ చేశారు. నటుడు బాలకృష్ణ లేకుండా ప్రెస్‌మీట్ ఎలా పెడుతారంటూ కొందరు నెటిజన్లు అడగడం.. ఆనంద్ వివరణపై చర్చ జరి గింది. ఆ తర్వాత సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతా లో ‘అరెస్ట్‌లతో పైరసీ ఆగదు, సైబర్ నేరాలను ఆప డం సాధ్యం కాదు’ అని మరో పోస్ట్ పెట్టారు. సీనియర్లు ఇలా పోస్ట్‌లు ఎందుకు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తవుతున్నది.
నెటిజన్ల ఆగ్రహం.. విమర్శలు
‘సినిమా డైలాగులు కొట్టడం కాదు.. దమ్ముంటే సైబర్ నేరాలను ఆపి చూడు ’ అంటూ క్యూన్యూస్ నిర్వాహకుడు, ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) నేరుగా సజ్జనార్‌పై కామెంట్ చేశారు. తెలంగాణ సమాజంలో 80 శాతం మంది ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెత్త సినిమాలతో రాష్ట్ర దేశ యువతను చెడగొడుతున్న వారికి మీరు సపోర్ట్ చేస్తారా? రాజకీయ నాయకులకు, సినిమా దోపిడీదారులకు మీరు వత్తాసు పలుకుతారా అంటూ సజ్జనార్‌ను ఓ నెటిజన్ ప్రశ్నించారు. అక్రమంగా ధరలు పెంచినప్పుడు నియంత్రించని అసమర్థులు సినిమా వాళ్లకు మద్దతుగా ఉండడం సరైంది కాదంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇలా సోషల్‌మీడియాలో ఐపీఎస్ ఆఫీసర్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.