సిటీ బ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి వందేండ్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్న గండిపేట-ఆసిఫ్‌నగర్ కాన్డ్యూట్ నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నది. వందేడ్ల నుంచి నిర్విరామంగా నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న చరిత్రాత్మక కట్టడం అధికారుల నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరువతోంది. ఎలాంటి మోటార్లు లేకుండా కేవలం గురుత్వాకర్షణ శక్తితోనే నీరు ప్రవహించేలా 1920లో నాటి ఇంజినీరింగ్ దిగ్గజం ఈ కాన్డ్యూట్ను గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ దాకా సుమారు 15 కిలోమీటర్లు నిర్మించారు. వందేండ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రజల దాహం తీరుస్తున్న కాలువకు జలమండలి అధికారులు చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయించకుండా అచేతన స్థితికి చేరుస్తున్నారు. దీంతో కాన్డ్యూట్ పొడవునా పదుల సంఖ్యలో లీకేజీలు ఏర్పడి లక్షల లీటర్ల తాగునీరు వృథాగా పోతున్నది.
అడుగడుగునా లీకేజీలు..
గండిపేటలోని ఉస్మాన్ సాగర్ నుంచి కేవలం గురుత్వాకర్షణ శక్తితో నీటిని సరఫరా చేసేలా ఎగువ ప్రాంతం గండిపేట నుంచి దిగువ ప్రాంతమైన ఆసిఫ్‌నగర్ వరకు ఏటవాలుగా కాన్డ్యూట్ను నిర్మించారు. కొకాపేట, మణికొండలో కొంత దూరం ఆర్చీలపై నుంచి నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కట్టడాన్ని జలమండలి ఏండ్ల తరబడిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. దీని ద్వారా తాగునీటిని తీసుకోవడమే కాని నిర్వహణను గాలికొదిలేసింది. కొన్నేండ్లుగా చిన్నచిన్న గండ్లను కూడా పూడ్చటం లేదు. దీంతో కాన్డ్యూట్ పొడవునా పదుల సంఖ్యలో లీకేజీలు ఏర్పడ్డాయి. గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ దాకా దాదాపు 40 నుంచి 50 చోట్ల రంధ్రాలు పడ్డాయి. కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద గండ్లు ఏర్పడ్డాయి. దీంతో రోజూ లక్షలాది లీటర్ల నీరు వృథాగా పోతున్నది. లీకేజీ నుంచి వచ్చిన నీరు రోడ్డుపై చేరి ఆ ప్రాంతమంతా బురదమయం అవుతుండటంతో దోమలు విజృంభిస్తున్నాయి.
భూగర్భంలో ఉన్నచోట్ల వ్యర్థాలతో కలుషితం..
కోకాపేట, మణికొండలోని కొంత భాగంలో మాత్రమే గ్రావిటీని ఆధారంగా చేసుకుని ఆర్చీలు నిర్మించారు. గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ దాకా దాదాపు అన్ని ప్రాంతాల్లో కాన్డ్యూట్ భూగర్భంలోనే ఉంది. కొన్ని చోట్ల భూమి ఉపరితలంలో ఉంది. భూగర్భంలో ఉన్న చోట్ల కాన్డ్యూట్పై స్లాబ్ వేసి కొంతమంది ఆక్రమించారు. మరికొన్ని చోట్ల కాన్డ్యూట్పై చెత్త చెదారం వేస్తున్నారు. కాన్డ్యూట్ మొత్తం పైకప్పు గ్రానైట్ రాళ్లతో కప్పి ఉంచారు. కొన్నిచోట్ల రెండు రాళ్లకు మధ్య ఉన్న సిమెంట్ తొలగిపోయి ఉన్నది. అలాంటి ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాలు వేస్తుండటంతో అదంతా నీటిలో చేరి కలుషితం అవుతున్నది. గండిపేట నుంచి కోకాపేట మధ్యలో శంకర్ప్రల్లి హైవే ఉండటంతో అక్కడ కాన్డ్యూట్పై అండర్‌పాస్ నిర్మించారు.
ఈ అండర్ పాస్ కింద చుట్టుపక్కల వాళ్లు భారీగా చెత్త, వాడిపడేసిన వస్తువులు, పాత బెడ్లు, దుస్తులు పడేస్తున్నారు. దీంతో ఆప్రాంతమంతా చెత్త కుప్పలను తలపిస్తున్నది. అక్కడ రోడ్డుపై డివైడర్ లేకపోవడంతో గండిపేట-కోకాపేటకు రాకపోకలు సాగించేవారు అండర్ పాస్ నుంచే వెళ్తున్నారు. దీంతో కాన్డ్యూట్ పైకప్పు రాళ్ల మధ్య సిమెంట్ ఊడిపోయి చెత్త, మట్టి, వ్యర్థాలు పడటం వల్ల నీరంతా కలుషితమవుతున్నది. ఏండ్ల తరబడిగా ఈ తతంగం కొనసాగుతున్నా జలమండలి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కాన్డ్యూట్ నుంచి వచ్చే నీటిని నగరంలోని లక్షల మంది తాగుతున్నారు. కలుషితం కావడం వల్ల ఆ నీటిని తాగినవారు వ్యాధుల బారినపడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
కబ్జా కోరల్లో కాన్డ్యూట్ బఫర్‌జోన్..!
గండిపేట-ఆసిఫ్‌నగర్ కాన్డ్యూట్ వందేండ్ల నాటిది కావడంతో ప్రభుత్వం వారసత్వ సంపదగా నిర్ధారించింది. కాన్డ్యూట్కు ఇరువైపులా 50 అడుగుల విస్తీర్ణం వరకు బఫర్‌జోన్‌గా గుర్తించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయాలని అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ గండిపేట నుంచి ఆసిఫ్‌నగర్ దాకా ఎక్కడా బఫర్‌జోన్ కనిపించదు. కాన్డ్యూట్కు ఇరువైపులా అంతటా ఆక్రమించేశారు. కొన్నిచోట్ల పైకప్పుపైనా అక్రమ నిర్మాణాలు చేపట్టగా.. మరికొన్నిచోట్ల స్లాబ్ వేసి ఆక్రమించారు. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా జలమండలి అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు అధికారులే అండగా ఉంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించడంతోపాటు నగర ప్రజలకు తాగునీరందించే వారసత్వ సంపదను సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.