LIfe style : మానసిక ఒత్తిడి (Mental pressure) కారణంగానో, పని భారం (Work burden) వల్లనో, విందులు వినోదాల వల్లనో కొన్ని సందర్భాల్లో మనం కంటినిండా నిద్రపోలేకపోతాం. ప్రతి మనిషి జీవితంలో ఇది సర్వసాధారణం. అయితే కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం మన శరీరంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఒక్క గంట నిద్రలోటును భర్తీ చేయడానికి కనీసం నాలుగు రోజుల వరకు సమయం పట్టవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్ర అనేది కేవలం అలసటను తీర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. అది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి లాంటి అనేక శారీరక, మానసిక ప్రక్రియలకు అత్యవసరమని చెబుతున్నారు. మనం నిద్రపోయినప్పుడు మెదడులో రోజువారీ పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి కొత్త సమాచారం నిక్షిప్తం అవుతుంటుందని, కేవలం ఒక గంట నిద్ర తగ్గినా ఈ ప్రక్రియలన్నీ సరిగా జరగక చిన్నపాటి ‘స్లీప్ డెబ్ట్ అంటే నిద్ర బాకీ (Sleep Debt)’ ఏర్పడుతుందని వివరిస్తున్నారు.
ఆ నిద్ర బాకీని తీర్చడానికి మన శరీరం కేవలం ఒక రాత్రి అదనంగా నిద్రపోవడంతో సరిపోదని, మెదడు, శరీర కణాలు సాధారణ స్థితికి రావడానికి, కోల్పోయిన విశ్రాంతిని తిరిగి పొందడానికి కొన్ని రోజులు పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అందుకే ఒక రాత్రి గంట నిద్ర తక్కువైతే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చికాకు లాంటి లక్షణాలను అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు.
ఏదైనా కారణం వల్ల నిద్ర బాకీ ఏర్పడితే తర్వాత రోజుల్లో గాఢమైన నిద్రద్వారా దాన్ని తీర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గాఢ నిద్ర కోసం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. వారాంతాల్లో కూడా టైమ్ షెడ్యూల్ను తూచూతప్పకుండా పాటిస్తే నిద్రబాకీ పేరుకుపోకుండా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా మంచి నిద్ర కోసం పడకగది చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
నిద్రకు ఉపక్రమించే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలంటున్నారు. రోజూ మధ్యాహ్నం ఓ 20 నిమిషాలపాటు పవర్ నాప్ తీసుకోవడంవల్ల కూడా అలసట తగ్గి, రోజంతా చురుకుగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే పగలు ఎక్కువసేపు నిద్రపోవడం, సాయంత్రం వేళల్లో కునుకు తీయడం మంచిది కాదని అంటున్నారు. సాయంత్రం వేళల్లో కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం కూడా నిద్రకు భంగం కలిగిస్తుందని చెబుతున్నారు.
కాబట్టి నిద్రకు భంగం కలిగించే పనులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా, ఎనిమిది గంటలకు మించకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.