సంభల్: ఇన్స్టాగ్రామ్(Instagram)లో రీల్స్ కోసం హద్దులుమీరి మరీ వీడియోలు చేస్తున్నారు. డబ్బు సంపాదన కోసం కొందరు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా తమ ఇన్‌స్టా అకౌంట్‌తో ఫుల్ సంపాదించారు. అయితే వాళ్లు చాన్నాళ్లుగా తమ సోషల్ మీడియా అకౌంట్లో అసభ్యరకమైన వీడియోలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేశారు. దాంట్లో సంభల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు.
రెచ్చగొట్టే రీతిలో ఆ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అసభ్యరమైన భాషను కూడా వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాలో పోస్టు చేస్తున్న కాంటెంట్‌తో ఆ ఇద్దరూ ప్రతి నెలా సుమారు 30 వేల వరకు ఆర్జిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆ ఇన్‌స్టా గ్యాంగ్ గురించి మరిన్ని వివరాలు తెలిపారు. మెహరుల్ నిషా అలియాస్ పారి, మెహక్, హీనా అనే ముగ్గురు అమ్మాయి ఇన్‌స్టా అకౌంట్ నడిపిస్తున్నట్లు తేల్చారు. అభ్యంతరకరమైన వీడియోలను తీసి వాటిని ఇన్‌స్టాలో పోస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫాలోవర్ల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రయత్నాలు చేశారు. జరార్ ఆలమ్ అనే మరో వ్యక్తిని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. కాంటెంట్ క్రియేషన్, ప్రమోషన్‌కు అతను పాల్పడుతున్నట్లు తేల్చారు.
అస్మోలీ పోలీసు స్టేషన్లో మెహక్, పారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్‌స్టా అకౌంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 296(బీ), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం కేసు బుక్ చేశారు. అసభ్యకరమైన కాంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.