Apache Helicopters : భారత ఆర్మీ (Indian Army) కి మరింత బూస్ట్ అందనుంది. అమెరికా (USA) నుంచి వచ్చేవారం మూడు అపాచీ హెలికాప్టర్లు (Apache Helicopters) భారత్‌కు రానున్నాయి. జూలై 21న ఆ హెలికాప్టర్లు మన దేశానికి చేరుకోనున్నాయి. ఆ హెలికాప్టర్ల కోసం భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. అనివార్య కారణాలవల్ల వాటి డెలివరీ ఆలస్యమైంది. ఆ హెలికాప్టర్లను శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు.
అమెరికా నుంచి కొత్తగా వస్తున్న ఆ మూడు ఆపాచీ హెలికాప్టర్లను పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు భారత రక్షణ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. ఈ AH-64E అటాక్ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ కానున్నాయి. ఇండియన్ ఆర్మీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తొలి అపాచీ స్క్వాడ్రన్‌ను నెలకొల్పిన 15 నెలల తర్వాత ఈ హెలికాప్టర్లు భారత్‌కు వస్తున్నాయి.
సప్లయ్ చైన్‌లో అంతరాయాలు, అంతర్జాతీయంగా జియోపొలిటికల్ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఈ అపాచీ హెలికాప్టర్లు భారత్‌కు చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో రెండు స్క్వాడ్రన్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఒకటి పఠాన్‌కోట్‌లో, మరొకటి జోర్హాట్లో పొజిషన్లో ఉన్నాయి.
కాగా, ఇప్పటికే 2015లో అమెరికా ప్రభుత్వంతో, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్‌కు డెలివరీ చేసింది. అదే ఏడాది చివరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది.
ఆ 6 హెలికాప్టర్లకుగాను ఒప్పందంలో భాగంగా తొలి విడత మూడు హెలికాప్టర్లు 2024 మే, జూన్ నెలల్లో భారత్‌కు రావాల్సి ఉంది. కానీ పైన పేర్కొన్న కారణాల రీత్యా వాటి రాక ఆలస్యమైంది.