Infant | ముంబై : ఇది అమానవీయ ఘటన. తమకు జన్మించిన బిడ్డ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఓ ఇద్దరు దంపతులు. వేగంగా వెళ్తున్న బస్సులో బిడ్డ జన్మించగా.. క్షణాల్లోనే ఆ బిడ్డను కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు భర్త. ఈ ఘటన మహారాష్ట్రలోని పర్భాణి ఏరియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రితికా ధేరే తన భర్త అల్తాఫ్ షేక్‌తో కలిసి స్లీపర్ కోచ్‌లో పుణె నుంచి పర్భాణికి బయల్దేరింది. రితికాకు నెలలు నిండడంతో మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్లీపర్ కోచ్‌లోనే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను పెంచడం భారంగా భావించిన భార్యాభర్తలిద్దరూ.. పసిబిడ్డను ఓ గుడ్డలో చుట్టి బస్సు కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. గమనించిన బస్సు డ్రైవర్.. అల్తాఫ్‌ను ప్రశ్నించగా, సమాధానం దాటవేశాడు.
అయితే అప్పుడే పుట్టిన పసికందును బస్సు కిటికీలో నుంచి బయటకు పడేయడాన్ని స్థానికులు గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా పసికందు మృతదేహాన్ని చూసి షాకయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ సిబ్బందితో ఆ బస్సును పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో తనిఖీలు చేయగా, రితికా, అల్తాఫ్ పట్టుబడ్డారు. తమకు బిడ్డను పోషించే స్థితి లేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు దంపతులు తెలిపారు. గత 18 నెలల నుంచి వీరిద్దరూ పుణెలో ఉంటున్నారు. అయితే వీరిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. రితికాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.