శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jun 20, 2020 , 01:16:13

ఆయనకు ఆమెలా.. ఎందుకు?

ఆయనకు ఆమెలా.. ఎందుకు?

మా ఆయన వయసు 46 సంవత్సరాలు. ఆయనకు ఆడవాళ్లలా రొమ్ములు ఉన్నాయి. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా కనిపిస్తున్నారా? లేకపోతే, ఏమైనా జబ్బు ఉందా? నలుగురిలోకి వెళ్లలేక చాలా బాధపడుతున్నారు. మగవాళ్లకు ఇలా ఎందుకు వస్తుంది?  పరిష్కారం ఏమిటి?- బి.ఆర్‌, సికింద్రాబాద్‌

పురుషుల్లో ఇలా రొమ్ములు పెరగడాన్ని గైనెకోమాస్టియాగా వ్యవహరిస్తారు. దీనికి సాధారణంగా శారీరక కారణాలు ఉంటాయి. అయితే దీనివల్ల ప్యూబర్టీ, ఆండ్రోపాజ్‌ (మగవాళ్ల మెనోపాజ్‌) లాంటి మార్పులేమీ ఉండవు. జీవన శైలి సమస్య వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. ఆధునిక ఆహారపు అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయి. అంతేగాక ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా గైనెకోమాస్టియాకు కారణమవుతున్నాయి.. అంటే పాలు, పాల ఉత్పత్తులు, జంతుమాంసం వంటివి తీసుకోవడం. జంతువులకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారు.

అలాంటి వాటి నుంచి వచ్చే ఆహార పదార్థాల వల్ల మనకు కూడా పరోక్షంగా ఈస్ట్రోజన్‌ చేరుతున్నది. ఎక్కువగా కూర్చునే వాళ్లలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. స్థూలకాయం కీలక పాత్ర వహిస్తున్నది. అయితే ఇది ప్రాణాంతక సమస్య ఏమీ కాదు. చికిత్స తీసుకోకపోతే ఇతరత్రా జబ్బులు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. కానీ సామాజిక కారణాల వల్లనే చాలామంది చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తారు. గైనెకోమాస్టియా చాలా తక్కువ స్థాయిలో ఉంటే.. అంటే రొమ్ములు చిన్నగా మాత్రమే కనిపిస్తే జిమ్‌లో వర్కవుట్లు చేయడం ద్వారా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీన్ని తగ్గించడానికి మందులు ఏమీ లేవు. కానీ సర్జరీ ద్వారా దీన్ని నయం చేయవచ్చు. జనరల్‌ అనెస్తీషియా గానీ, రీజనల్‌ అనెస్తీషియా గానీ ఇచ్చి లైపోసక్షన్‌ ద్వారా సరిచేయవచ్చు. ఆ తరువాత యాంటిబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. కొద్దిరోజుల విశ్రాంతి అవసరం. ఆ తరువాత ఎప్పటిలాగా అన్ని పనులూ చేసుకోవచ్చు. మీ వారి బరువెంతో రాయలేదు. సమస్య ఎంత తీవ్రంగా ఉందో కూడా చెప్పలేదు. సమస్య చిన్నగానే ఉన్నట్టయితే వర్కవుట్ల మీద శ్రద్ధ పెట్టమని చెప్పండి. లేకపోతే దగ్గరలోని కాస్మెటిక్‌ లేదా ప్లాస్టిక్‌ సర్జన్‌ని సంప్రదించండి. 

డాక్టర్‌ జి. వెంకటేశ్‌ బాబు

కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌

కాస్మోక్యూర్‌ క్లినిక్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌


logo