యుద్ధభూమిలో ఉభయసేనల మధ్య రథం నిలపవలసిందిగా శ్రీకృష్ణుడిని కోరాడు అర్జునుడు. వాసుదేవుడు రథాన్ని అలాగే మధ్యలో నిలిపి రెండు సేనలనూ ఒక్కసారి చూడమన్నాడు. ఇరుపక్షాల్లో ఉన్న బంధుజనాన్ని చూడగానే అర్జునుడికి విషాదం ఆవరించింది. చేతిలోని గాండీవం జారిపడింది. శరీరం కంపించింది. నోరు ఎండిపోయింది. ఇంద్రియాలు బలహీనమయ్యాయి. ఇంకేముంది? యుద్ధం చేయనన్నాడు. బంధువులను చంపి, రక్తసిక్తమైన రాజ్యాన్ని పొందలేనన్నాడు. బంధువులను చంపడం వల్ల, తాను పాపినవుతానని, కులక్షయాన్ని సహించనని చెప్తాడు.
ఒకవిధంగా అర్జునుడిని పిరికితనం ఆవహించింది. ఏం చేయాలో తెలియనివాడై కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణుణ్ని కోరాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆత్మ, అనాత్మ గురించి చెప్పవలసి వచ్చింది. ఈ రెండింటి మధ్య తేడా తెలిస్తేనే అర్జునుడు తిరిగి యుద్ధం చేయగలుగుతాడు. ఎంతటి విషాదంలో ఉన్నా మానవుడికి ఆధ్యాత్మికంగా సరైన ఉపదేశం అందితే బాగుపడతాడన్నది నిజం. అందుకే యుద్ధభూమిలో సహనం కోల్పోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మ-అనాత్మ వివేకం కల్పించి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు.
‘నీవు గాని, నేను గాని ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేనివాళ్లం కాదు. ఆత్మ నశించదు. అది శాశ్వతమైంది. శరీరమే నశిస్తుంది. అది ఆత్మకంటే భిన్నమైంది’ అని ఆత్మ-అనాత్మ వివేకం కలిగిస్తాడు శ్రీకృష్ణుడు. భగవానుడు ఆత్మవిదుడు, మహాజ్ఞాని, యోగీశ్వరుడు. ఆ మహా పురుషుని ప్రతి మాటా ఆలోచింపదగినది.
‘న త్వేవాహం జాతునాసం’ ఈ మాట చాలు ఆత్మ నిత్యమైనదని చెప్పడానికి. స్వయంగా కృష్ణుడు ‘నేను లేనివాణ్ని కాదు, నువ్వూ లేనివాడవు కావు’ అని చెప్పడం వల్ల ఆత్మ అనేది అనాది పదార్థమని, ఉనికి కలిగినదని అర్థమవుతుంది. ఆత్మ అన్ని లోకాల్లోనూ ఉనికి కలిగి ఉంటుంది. అది శరీరంలో ప్రవేశిస్తుంది. అయితే, బాల్య, యౌవన, వృద్ధావస్థలు శరీరానికే కానీ, ఆత్మకు చెందవు. ఆత్మ ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. కానీ, శరీరం మార్పులకు లోనవుతుంది. కర్మవశాన జీవాత్మకు శరీరం లభిస్తుంది. అది ప్రకృతి వల్ల పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, వృద్ధి చెందుతుంది, మార్పునకు లోనవుతుంది, చివరికి శిథిలమవుతుంది. ఈ ప్రపంచం ఈ విధంగా ఎప్పుడూ ఉండదు. దానికి సృష్టి ఎంత సత్యమో, ప్రళయమూ అంతే సత్యం. పుట్టింది గిట్టక మానదనే సామెత మనం వింటుంటాం. నిజానికి పుట్టింది శరీరం, గిట్టేదీ శరీరమే కానీ, ఆత్మ కాదు.
జన్మ ఎత్తినప్పుడల్లా జీవుడికి కొత్త శరీరం సంప్రాప్తమవుతుంది. జీవుడు ఆ శరీరంతో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండి, దేహాంతర ప్రాప్తి అంటే మరొక దేహంలోకి ప్రవేశిస్తాడు. దేహాలు మారుతుంటాయి కానీ, ఆత్మ ఎన్నటికీ మారదు. ఇంతకు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవలసి ఉన్నది. లేనిదాని నుంచి ఉన్నది రాదని, ఉన్నది లేకుండా పోదని శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం గమనించదగినది. ఆత్మ లేనిదాని నుంచి రాలేదు. అది ఎప్పటికీ ఉన్నదే. ఉన్నదానికి లేనిది కారణం కాజాలదు. శరీరం లేనిది కావచ్చు. కానీ అది లేని దానినుంచి రాలేదు. ఉనికి గల ప్రకృతి నుంచి వచ్చింది. అయితే, ఆత్మకు చావు లేదు. శరీరానికి మాత్రం ముగింపు కనిపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ‘ఎవరైనా ఆత్మను చంపుతున్నానని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు’ అన్నాడు. మనిషిని చంపుతున్నానని భావించేవాడు కేవలం శరీరాన్ని మాత్రమే ఆత్మ నుంచి వేరు చేస్తున్నట్లు భావించాలి. అలాగే తాను మరణిస్తున్నానని భావించేవాడు, కేవలం తాను ఆత్మ కాబట్టి శరీరం నుంచి వైదొలుగుతున్నానని అనుకోవాలి. అలా అనుకోకపోతే ఆ ఇద్దరూ మూర్ఖులేనని భగవానుడు స్పష్టం చేశాడు.
ఆత్మతత్వం అందరికీ బోధపడదు. దాన్ని కొందరు ఆశ్చర్యంగా చూస్తారు. కొందరు దాని తత్వాన్ని తెలుసుకుంటారు. అజ్ఞానులు ఆత్మనూ, శరీరాన్ని ఒకటిగానే భావిస్తారు. జ్ఞానికి ఈ భేదాలుండవు. ‘ఓ అర్జునా! నీవు చంపుతున్నది శరీరాలనే అని గుర్తుపెట్టుకో. నీవు ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని నిర్వహించడానికి వచ్చావు. యుద్ధం చేయడం ద్వారా నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఆత్మ శాశ్వతమైనది. నువ్వు దాన్ని సంహరించలేవు. శరీరం అనాత్మ. అది చచ్చినా తిరిగి లభిస్తుంది’ అని అర్జునుడికి ఆత్మ-అనాత్మ వివేకాన్ని కలిగించి కార్యోన్ముఖుణ్ని చేశాడు శ్రీకృష్ణుడు.
– ఆచార్య మసన చెన్నప్ప
98856 54381