చాలా అందమైన ముఖచిత్రం. కవి మనసును దండెంగా కట్టారు. దానిపై మూడు పక్షులను, అదే త్రివేణిలను కూర్చోబెట్టారు. ఆ మూడు గంగా, యమునా, సరస్వతిలా ప్రవహిస్తూ వెళ్లాయి. కవిత్వం అనేది ఒక స్వాప్నిక ప్రక్రియ. స్వప్నం వాస్తవం కాదు, నిజానికి స్వప్నంలో వాస్తవాలుండవు. అయితే స్వప్నం వాస్తవానికి నకలు కాకపోయినా వాస్తవాన్ని ఏదో రకంగా ప్రతిబింబిస్తుంది.
‘త్రివేణి’లను చదివితే మాత్రం ఆనంద్ తన గతానుభవ వాస్తవాలను మళ్లీ మళ్లీ కలగంటున్నారేమో, కవిత్వీకరిస్తున్నారేమోనని అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా కనపడే ప్రపంచం వాస్తవం కానేకాదని ‘వాస్తవం ముసుగు తీయటమే వాస్తవమని’ అజంతా కలం పేరుతో కవిత్వం రాసిన పెనుమర్తి విశ్వనాథశాస్త్రి అంటారు. అలా వాస్తవాల ముసుగు తీసి మరీ వాస్తవాలు రాస్తుంటారు వారాల ఆనంద్.
‘బ్రతికి ఉండడం వల్ల బాగా రాయగలుగుతున్నావు అంటారు జనం. కాదు, రాయడం వల్లే బ్రతుకున్నాను’ అంటారు ఆనంద్. ‘ఆరోగ్యం బాగుండడం వల్లే రాస్తున్నావ్’ అంటారు అందరూ. కాదు, ‘రాయడం వల్లే ఆరోగ్యం బాగుంది’ అంటారు ఆనంద్. ఎపిగ్రామ్ అనేది చిన్నదైన సుతిమెత్తని వ్యంగ్య భావం కలిగిన కవిత అని ఈ రకమైన చిన్న కవితల్లో తక్కువ పదాల్లో గొప్ప చమత్కారం వ్యక్తమవుతుందని అంటారు. ఫ్రీవర్స్ వచన కవితగా పిలువబడే ఈ రూపం నిబంధనలకు అతీతంగా స్వేచ్ఛగా రచించబడిన చిన్న కవితలు అంటూ.. తన మనసులోని సుతిమెత్తని వ్యంగ్యాన్ని ఎక్కువ శబ్దం లేకుండా నిశ్శబ్ద గీతికల్లా వెలువరించారు ఆనంద్.
ప్రపంచం చాలా పెద్దదైనప్పటికీ రీల్స్, షాట్స్ అంటూ జీవితాన్ని చిన్నబుచ్చుకుంటున్నారో, విశాల హృదయాన్ని కుదించుకుంటున్నారో తెలియని ఈ కాలపు యువత ఆలోచనలకు తగ్గట్టుగా ఆనంద్ త్రివేణిలో ఈ కాలపు కవిత్వం కూడా చిన్నగా ఉండాల్సిన అవశ్యకతను అర్థం చేసుకున్నారు. అందిపుచ్చుకున్నారు కూడా.
చిన్న కవిత్వం చిరాకు పడక చదువుతారనే పాఠకుల నాడిని పట్టుకున్నారు. తన ‘త్రివేణి’ పుస్తకంలో చిన్న కవిత్వానికి సంబంధించి కవి బాధ్యతగా జపాన్‌కి చెందిన హైకూ కవితల గురించి, కప్లెట్స్ గురించి, ముక్తకాలు ఇంకా ‘టాంకా’లకు సంబంధించి ముందుమాటలో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చదువరులకు కవులయ్యే దారిని చూపించారు.
‘ఎవరో తలుపు తట్టిన చప్పుడు ఇంటి తలుపా గుండె తలూపా’
అనే ట్రిప్లెట్తో పుస్తకం మొదలుపెట్టారు. తలుపు చప్పుడనే విషయం తనకూ, మనకూ తెలుసు. ఇక్కడ సందేహమల్లా ఇంటి తలుపా, గుండె తలుపా అనేదే. కవిత్వం ఒక ఆల్కెమీ అని దాని రహస్యం కవికే తెలుసునన్నట్లుగా ఆనంద్‌కు కూడా ఈ ఆల్కెమీ రహస్యమేదో బాగా తెలిసిపోయినట్లుంది. అందుకే ఒకదాని తరవాత ఒకటి అందమైన వేణిలు అల్లేసారు. త్రివేణిలను పలికించారు.
‘ప్రకృతిలోంచి ప్రకృతిలోకి చేసే ప్రయాణమే కవిత్వం’.. అంటూ ‘పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది’
లాంటి పంక్తులతో కాళోజీని గుర్తుచేశారు. కవిత్వంలో ఆర్కిటెక్చర్ బాగా తెలిసున్న కవింజినీర్ ఆనంద్. గుడిసెనో-గూన ఇల్లో-ఇల్లో-విల్లానో, ఏదో ఒకటి అచ్చంగా అలాగే త్రివేణిలో – ముక్తకాలో, కవిత్వమో- కథనమో, విమర్శో – ఆత్మకథో ఏదైతేనేమీ ఇంటీరియర్, ఎక్స్రియర్ రెండూ తెలిసిన వ్యక్తి. తన కలలను వాస్తవాలుగా మార్చగల వ్యక్తి. తన వాస్తవాలను కలగనగల కవిశక్తి. చిన్న కవితలు రూపంలో చిన్నవే అయినా వాటి ప్రభావం అమితమైనది. చిన్న కవితే పాఠకుల హృదయాలను ఎక్కువ గాఢంగా తాకుతుంది. నిజానికి ఒక చిన్న కవితలో జీవితాన్ని తిరగ రాయవచ్చంటూ చిన్న కవిత్వాన్ని చేరదీసిన పెద్ద మనసున్న కవి వారాల ఆనంద్. కవులు, కవిత్వం రాయాలనుకునే కొత్త తరం భావుకతతో నిండిన ఈ కవిత్వాన్ని చదవాల్సిందే.
– కల్వకుంట్ల శ్రీలతరావు 94914 80386