మాగనూర్, నవంబర్ 17 : రైతులు పండించిన పత్తి పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పత్తి రైతులు రోజువారీగా పత్తి అమ్ముకోవడానికి మాగనూరు మండలం వడ్వాట్ కాటన్ మిల్ దగ్గరకు దాదాపు 40మందికి పైగా రైతులు పత్తిలోడు తీసుకెళ్లగా తీరా అకడ కాటన్ మిల్ యజమానులు సమ్మె నిర్వహించిన పత్తి కొనుగోలు చేయబోమని కాటన్ మిల్లుకు తాళం వేసి వెళ్లిపోయారు. నానా ఇబ్బందులు పడి అమ్ముకోవడానికి తెచ్చిన పత్తిని కొనకపోవడంతో ఆగ్రహించిన రైతులు వడ్వాట్ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్ల కోసం సీసీఐ, మిల్లర్లతో కుమ్మకై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దిగుబడులు తగ్గి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, మరోవైపు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం రోజుకో నిబంధనలతో రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లు జరగక రైతులు నిత్యం రహదారులపై ఆందోళనలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. పత్తి రైతుల ఇబ్బందులను పట్టించుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్ల వైపు కనీసం కన్నెత్తి చూడకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, వారికి అండగా నిలబడి పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల రాస్తారోకోతో నాలుగున్నర గంటల పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాగనూర్ తాసీల్దార్ సురేశ్, డీఎస్పీ లింగ య్య, మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి, మక్తల్, మాగనూర్, కృష్ణ ఎస్సైలు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు, మక్తల్ సీసీఐ మేనేజర్ అనూఫ్మిశ్రాతో మాట్లాడించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మక్తల్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, నాయకులు నరసింహారెడ్డి, శివారెడ్డి, ఇతర పార్టీల నాయకులు నల్లే నరసయ్య, వడ్వాట్ రాఘవరెడ్డితో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.