అమ్మాయి అవనికి వెన్నెల
ఆడబిడ్డ హరిత కాంతి
హద్దులను సరిహద్దులను దాటి
ఆకాశాన అరుంధతై వెలిసింది
గంగ కృష్ణా గోదావరి కావేరి నర్మదా
నదులు కూడా
ఒక ఊరు బిడ్డలే ఒకింటి కూతుళ్ళే
అమ్మ నాయిన బిడ్డలే
అమ్మాయి
ఊరు దాటి తేరు దాటి
ఏరు దాటి మరో ఊరిలో
మరో కుటుంబ
జీవితాన్ని పంచుకోవటం
అమ్మాయిలకే సాధ్యం
చిగురించటమైనా జన్మనివ్వటమైనా
ఆడబిడ్డలకే సార్థకం
కడప కడిగి ముగ్గేసి బొట్టుపెట్టి
ఇల్లు దాటుతుంటే
పెళ్లి తరువాత సాగనంపటం
ఒక్కసారిగా మా ఇంటిపై
మొంథా తుపాన్ తిష్టవేసింది
రెండు దశల బాల్య సింగిడి
చదువు కుటుంబం ఆత్మీయతలు
మమతలు మమకారాలు
గుండె గూటి నిండా
ఒడిబియ్యంతో పాటు
పసుపు కుంకుమలు
మామిడి దానిమ్మ జామ తీరొక్క పళ్ళు
అప్పగింతల తరువాత
ఇంటి కంట్లో కన్నీళ్లు
అత్తగారింట్లో
నవధాన్యాలై మొలకెత్తుతాయి
వాకిలి ముంగిట్లో
కొత్త రంగుల ముగ్గులు
బంధాలు కొత్తైనా అన్నింటిని
తల్లిగారింటిలా తలకెత్తుకుంటుంది
అమ్మ ఒడినిండినట్లు
నాయిన గుండెల మీద ఆడుకున్నట్లు
అన్నదమ్ములతో ప్రేమగా
స్నేహితంగా ఉన్నట్లు
అక్కా చెల్లెళ్ళతో అనురాగంగా
అత్తమామలతో, భర్త, మరుదులతో
ఆడబిడ్డలతో అనుబంధాల్ని
పెనవేసుకుంటుంది
ఆడుకున్న వానగుంతల పీట
పేర్చుకున్న బొమ్మల కొలువు
గీసుకున్న చిత్రాలు నాటిన
గులాబీ పూల చెట్లు
మది నిండా నింపుకున్న
యాదుల్ని వదలి
ఆకుపచ్చ చెట్టు అడుగుల్లా
కుటుంబమై విస్తరిస్తుంది
ఒక్కరోజు ఇల్లు ఇడువలేము
పుట్టినింట నేర్చిన గౌరవ సంస్కారం
ఇరుగు పొరుగు స్నేహాలు
అనురాగాలు ఆప్యాయతలు
అత్తగారింటికాడ ప్రభాతగీతాలై
తొలకరి ఆరుద్రలై ముచ్చటజేస్తాయి
తల్లిగారింటి గౌరవాన్ని తగ్గించినా
మెట్టింటి సంస్కారాన్ని తక్కువజేసినా
శివంగిలా కయ్యిన లేస్తది
సంస్కృతి సంస్కారాలు
చిక్కుడు తీగలై పందిరికెక్కుతాయి
కలల్ని కొంగున కట్టుకొని
‘కూరాడుకలి’తో తోడుపెట్టి
కాపురం కవ్వమై చిలుకుతుంది
గృహిణై సేద్యపుసాలై
ఉన్నత పదవులకు ఎన్నికై వన్నె తెస్తది
ఎంతెత్తు ఎదిగినా ఎంత దూరంలో ఉన్నా
రాఖీ పండుగ నాడు
అక్కాతమ్ముళ్ల బంధాల్ని మరువనీయదు
ఆడబిడ్డగా గడప దాటినా
కోడలు అత్తమ్మ,
నాయనమ్మ అమ్మమ్మగా
కాలం వెంట ప్రయాణిస్తూనే ఉంటుంది
ఇళ్లు వాకిళ్లు నిశ్శబ్ద
రూపమై అనిపించినా
కూతురుని కోడలిగా సాగనంపుతూ
కోడలిని కూతురుగా ఆహ్వానించటమే
తల్లిదండ్రుల బాధ్యత…
– వనపట్ల సుబ్బయ్య 9492765358