కొన్ని సాహిత్య సాధనాలు ఎట్లాంటివంటే, అవి రచనలో అంతటా సమానంగా (uniformly, evenly) వ్యాపించి ఉంటాయి, ఉండాలి కూడా. అలా లేనప్పుడు అవి వాటి నిర్వచనాలకు లొంగవు. అలెగరి రచన కొన్ని వాక్యాలకే పరిమితం అయి వుండదు, ఉండకూడదు. చైతన్య స్రవంతి విషయానికి వస్తే, పేరులోనే స్రవంతి ఉంది కనుక, అది ఒక పంక్తిలో మాత్రమే కాకుండా సాధ్యమైనంతవరకు రచనలో ఎక్కువగా వ్యాపించి ఉండాలి. అయితే, కొన్ని పారాగ్రాఫులలో మాత్రమే ఉండటం అప్పుడప్పుడు జరుగుతుంది. బుచ్చిబాబు రాసిన మరమేకులు, చీర మడతలు కథలో అదే జరిగింది.
ఒకటి రెండు వాక్యాలలో హాస్యం ఉంటే దాన్ని ప్రహసనం (farce or comedy) అనలేం. అది రచనలో చాలావరకు వ్యాపించి ఉండటం అవసరం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ, ఇటువంటి సాహిత్య సాధనాలు literary devices తక్కువగా ఉంటాయి. ఆంగ్ల సాహిత్యంలో 120కి పైగా ఉన్న సాహిత్య సాధనాల లో ఎక్కువ భాగం ఒకటి రెండు పంక్తులకో, లేదా కొన్ని పంక్తులకో పరిమితమై ఉంటాయి. అటువంటివాటిని చర్చించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. అందుకే ఈ వ్యాస శీర్షికను అలా పెట్టాను.
అనుప్రాస (Alliteration): ఇందులో వాక్యంలోని పదాల మొదటి అక్షరాల ధ్వని (ముఖ్యంగా హల్లులది) ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకు, ‘పచ్చని పూల పందిరి పగలబడి నవ్వింది’. మొదటి నాలుగు పదాల ప్రారంభ ధ్వని ‘ప’కు సంబంధించి కదా. అచ్చు అనుప్రాస (vowel alliteration) కూడా ఉంటుంది. ‘ఇంతలోనే ఈవిడకు ఇష్టం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది’ అనే వాక్యంలో ఇ, ఈ లకు సంబంధించిన ధ్వని పునరుక్తమైంది.
వ్యంజనానుప్రాస (Consonance): ఇందులో పదాల ప్రారంభంలో, లేదా మధ్యలో, లేదా చివరలో హల్లు ధ్వని పునశ్చరణ ఉంటుంది. ఈ సినారె సినీ గీతాన్ని చూద్దాం.
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
‘తో’టలో ‘తొం’గి, ‘నీ’టిలో ‘నీ’డ (ప్రారంభ ధ్వనులు); తో‘ట’లో నీ‘టి’లో (మధ్య ధ్వనులు); నా‘డు’, నే‘డు’ – (చివరి ధ్వనులు) ఒకేలా ఉన్నాయి. ప్రారంభ ధ్వనులు ఒకే విధంగా ఉన్నాయి. కనుక, మొదటి పంక్తి ఒకే సమయంలో Consonance & alliteration అవుతుందని గమనించాలి. ‘ఎటు చూచిన చటులానల మటుమాయల వేళ’ (శ్రీశ్రీ) కూడా వ్యంజనానుప్రాసకు చక్కని ఉదాహరణ. దీన్ని మనం మామూలుగా అయితే ద్వితీయాక్షర ప్రాస అంటాం. కానీ, కాన్సొనెన్స్లో ఎన్నవ అక్షరపు ధ్వని అయినా పునరావృతం కావచ్చు.
స్వానుప్రాస (Assonance): ఇందులో పదాలలోని అక్షరాల అచ్చు ధ్వనులు (అచ్చులు కావు) ఒకే విధంగా ఉంటాయి. వీధులలో, నిశీధులలో శిలీంధ్రాలలాగా కుటీరాలు… అన్న పంక్తిలో ‘ఈ’కారం మళ్లీ మళ్లీ వచ్చింది కాబట్టి, ఇది స్వానుప్రాస. Assonanceకూ అంత్యప్రాస (end rhyme)కూ మధ్య చిన్న భేదం ఉంది. మొదటిదానిలో కేవలం అచ్చు ధ్వని ఒకేవిధంగా ఉంటే, రెండవదానిలో అచ్చు ధ్వని, హల్లు ధ్వని రెండూ ఒకేలా ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఐతే lake-fate లను మొదటిదానికి, lake-fakeలను రెండవదానికి ఉదాహరణలుగా చూపెట్టవచ్చు. తెలుగులో అయితే మొదటిదానికి ఉంగరం- ఉప్పెన, రెండవదానికి ఉంగరం-బొగరం ఉదాహరణలు .
అనాఫొరా(anaphora)లో ఒక పదంతో ఒక పంక్తిని ప్రారంభించి, అదే పదాన్ని మధ్య మధ్య పునశ్చరణ చేయడం ఉంటుంది. అరుణ్‌సాగర్ రాసిన మరణవాంగ్మూలం అనే కవితలోని ఈ పంక్తులను గమనించండి.. ఇచ్చోటనే/ కొంచెం ఇప్పసారా/ కొద్దిగా కొమ్ముబూరా ఇచ్చోటనే/ చలువ పందిళ్ళు పొగాకు బేళ్ళు ఇచ్చోటనే/ గలగల ఘల్లుమన్న/ రేలారేలా పరవళ్లు. ఇక్కడ అనాఫొరాతో పాటు అంత్యప్రాస (end rhyme) కూడా ఉంది. సారా- బూరా; బేళ్ళు-పరవళ్లు సూచిస్తున్నది అదే.
ఎపిస్ట్రొఫీ (epistrophe) అనాఫొరాకు వ్యతిరేకమైనది. అంటే ఇందులో ఒకే పదం పంక్తుల చివర మళ్లీ మళ్లీ వస్తుందన్న మాట. ఉదాహరణకు, దేవుడు మళ్లీ మరణించాడు అనే దెంచనాల శ్రీనివాస్ కవితలో ఐదు స్టాంజాలున్నాయి. ప్రతి స్టాంజా ప్రేమ మరణించింది అనే phrase (పదబంధం)తో ముగుస్తుంది.
అనాస్ట్రొఫీ (anastrophe) మరొక రకమైన సాహిత్య సాధనం. ఇందులో పంక్తులలోని పదాల సాధారణ క్రమం తారుమారవుతుంది. జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్‌లో a horrible dungeonకు బదులు a dungeon horrible, visible darknessకు బదులు darkness visible అనడం అనాస్ట్రొఫీ కిందికే వస్తుంది. Cheap one-night hotelsకు బదులు one-night cheap hotels (T.S.Eliot), vague terrified fingersకు బదులు terrified vague fingers (W.B. Yeats) అనడం కూడా ఉదాహరణలే. తెలుగులో అయితే, ‘వెన్నెల కాంతిని విరజిమ్మె గగనము’, ‘పల్లె వీధులలో నడిచె రాత్రి గాలి’ దీని కిందికే వస్తాయి. మామూలుగా అయితే గగనము వెన్నెల కాంతిని విరజిమ్మె, రాత్రి గాలి పల్లె వీధులలో నడచె అని ఉండాలి కదా. అనాస్ట్రొఫీని Poetic inversion అని కూడా వ్యవహరిస్తారు ఆంగ్లంలో. మొదటిది పారిభాషిక పదం కాగా, రెండవది మామూలు పదం. మరికొన్ని సాహిత్య సాధనాలతో తర్వాత మరొక వ్యాసం ఉంటుంది.
– ఎలనాగ