ఎక్కడి అలంపూర్, అచ్చంపేట.. మరెక్కడి మహబూబ్‌నగర్. ఆదిలాబాద్ ఏడుంది..మంచిర్యాల ఎక్కడుండే. సంగారెడ్డి ఆ మూలన.. సిద్దిపేట ఈ మూలన. వీటి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాలి. అప్పటి సౌకర్యాలు..ఇప్పటి సౌలభ్యాల గురించి ఎందుకు చర్చించాలి. ఎందుకంటే మనచుట్టూ ఎన్నో మార్పులు జరిగాయి. కలలో సైతం ఊహించనవి అనేకం జరిగాయి. వాటన్నింటిని తెలంగాణ సమాజం మరోసారి నెమరు వేసుకోవాలి.
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసారి ఉత్తచేతనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చేది. కొన్నిసార్లు రోజు ల తరబడి ఆడనే పడిగాపులు పడాల్సి వచ్చేది. సమైక్య రాష్ట్రంలో ఆనాటి రోజులను గుర్తుతెచ్చుకుంటే అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా తెలుస్తుంది. తెలంగాణలోని 10 జిల్లాలను 33 చేసుకున్నాం. ఒక్కోపెద్ద జిల్లా నుంచి మూడు నాలుగు జిల్లాలుగా కొత్తగా ఏర్పాటయ్యాయి. అన్ని జిల్లా ల్లో అద్భుతంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది. దూరం దగ్గరయ్యింది..పాలన ప్రజలకు చేరువయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలనా వికేంద్రీకరణ జరిగి అనేక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. పెద్ద జిల్లాలు కాస్తా చిన్నవిగా మారాయి. కొత్త కార్యాలయాలు వెలిశాయి. అధికారులు అందుబాటులోకి వచ్చారు. ఒకటి రెండు తప్ప ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జిల్లా విస్తీ ర్ణం చూసినా 50, 60 కిలోమీటర్లకు మించి పరి ధి ఉండదు. పని పడి కలెక్టరేట్ లేదా ఇతర ఏ ఆఫీస్‌కు పోవాలన్నా గంటల వ్యవధిలోనే పోయి వచ్చే సౌలభ్యం ఏర్పడింది. రోడ్లు, ట్రాన్స్‌పోర్టు బాగా అభివృద్ధి చెందాయి. సమైక్య రాష్ట్రంలో జిల్లాకేంద్రానికి పోవాలంటే రోజంతా టైం పడితే, ఇప్పుడు గంటల్లోనే పనిముగించుకొని జనం ఇంటికి రాగలుగుతున్నారు. అధికారులు సైతం దొరుకుతున్నారు. సర్టిఫికెట్లు వేగంగా జారీ అవుతున్నాయి. జిల్లాలు చిన్నవిగా మారడంతో పర్యవేక్షణ పెరిగింది. కలెక్టర్ లాంటి అధికారి ఒక్కరోజులో జిల్లా అంతా చుట్టేసి వస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాలంటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఆదిలాబాద్ కలెక్టర్ జిల్లా కేంద్రం వదిలి అదే జిల్లాలోని ఉట్నూరు, మంచిర్యాల పోవాలంటే రెండు మూడు రోజులు అక్కడే క్యాంప్ పెట్టాల్సి వచ్చేది. పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు జిల్లాస్థాయి అధికారులకు సైతం పర్యవేక్షణ ఇబ్బందికరంగానే ఉండేది. నేడు పాలనా వికేంద్రీకరణ జరగడంతో ఆ పరిస్థితి దూరమయ్యింది.ఇటు అధికారులు, అటు ప్రజలకు అనుకూలంగా మారింది. పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగం పుంజుకుంది. కొత్త మండలా లు, గ్రామ పంచాయతీల ఏర్పాటు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో ప్రజల ఏండ్ల నాటి డిమాండ్లు నెరవేరాయి. తద్వారా ప్రగతికి బాటలు వేశాయి.
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మన అస్తిత్వాన్ని చాటేలా, మన ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా, మన సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రూపుదిద్దుకుంటున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. అన్ని కా ర్యాలయాలు ఒకేచోట ఉంటే సేవలన్నీ అక్కడే లభిస్తాయి. తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం తెలంగాణలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో సైతం సమీకృత కార్యాలయాలు అందుబాటులోకి తెస్తున్నది. అన్ని కార్యాలయాలు, అధికారులందరూ ఒకే సముదాయంలో ఉండడం కారణంగా దస్ర్తాల క్లియరెన్స్, పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలు వేగంగా అమలు చేయగలుగుతున్నారు. శాఖల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది.తద్వారా పరిపాలన వేగంగా సాగి లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతాం. కొత్త సచివాలయాన్ని సైతం అదే ఉద్దేశం తో ప్రభుత్వం అద్భుతంగా నిర్మించింది.
తెలంగాణ గడ్డమీద అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. సబ్బండ వర్ణాల సంక్షేమానికి బాటలు పడ్డాయి. అనేక పథకాలు ఊపిరి పోసుకున్నాయి. సమైక్య పాలన మిగిల్చిన శిథిలాల మీద పునర్నిర్మాణం చేసుకుంటూ దేశ యవనికపై తెలంగాణ సత్తాచాటుతూ సగర్వంగా నిలుస్తున్నది. చిన్న రాష్ట్రమైనా పెద్ద ఘనతలు సాధిస్తూ తెలంగాణ లెక్కకుమించి అవార్డులు, ప్రశంసలు దక్కించుకున్నది.
నేటి అవసరాలకు అనుగుణంగా, ఆధునిక టెక్నాలజీ, సౌలత్‌లతో అత్యాధునికంగా.. సకల హంగులు.. సౌకర్యాలతో నిర్మాణం చేపట్టింది. గతంలో మాదిరిగా కాకుండా అన్ని శాఖ ల కార్యాలయాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. దేశ నూతన పార్లమెంట్, తెలంగాణ నూతన సచివాలయం ఒకేసారి రూపుదిద్దుకోవడం ఆనందదాయకం.పార్లమెంట్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించింది. అనేక విషయాల్లో చూస్తే తెలంగాణ సచివాలయాన్ని మాడల్ నిర్మాణంగా చెప్పవచ్చు. ప్రారంభోత్సవ వేళనే గ్రీన్ బిల్డింగ్ అవార్డును సొంతం చేసుకున్నది. రాష్ట్ర రాజధాని గడ్డపైన మరో ఐకాన్‌గా నిలవడం ఖాయం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా అన్యాయాలకు గురైంది. వనరులు దోపిడీ పాలయ్యాయి. ఏ రంగంలో చూసినా దగాపడ్డాం. మన చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలకు అంతేలేదు. శాంతియుత మార్గంలో సాగించిన తెలంగాణ పోరాటం ఫలించడం తో ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం ఆవశ్యకత ఏర్పడింది. అది తెలంగాణ అస్తిత్వ కోణ ంలో జరుగాలి. అప్పుడు రాష్ట్రం సాధించుకున్నందుకు సార్థకత ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నది.
యనిగండ్ల అశోక్: 99083 50676