Team India : రాయ్‌పూర్ వన్డేలో కంగుతిన్న భారత జట్టు మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బృందం గురువారం విశాఖ నగరంలో అడుగుపెట్టింది. విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో భారత క్రికెటర్లు శుక్రవారం నెట్స్ సెషన్లో చెమటోడ్చనున్నారు. శనివారం స్థానిక ఏసీఏ-వీడీసీఏలో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించనుంది. మరి, ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ ఎంతో తెలుసా..?
మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు వైజాగ్ చేరుకున్నాయి. చెరొక మ్యాచ్ గెలుపొందడంతో సిరీస్ పట్టేసేది ఎవరు? అనే ఉత్కంఠ నెలకొంది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదవ్వడంతో వైజాగ్ వికెట్ ఎలా ఉండనుంది? అనేది ఆసక్తి రేపుతోంది.
📍 Vizag #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/tx7qOgvZ1F
— BCCI (@BCCI) December 4, 2025
గత రికార్డులు చూస్తే.. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ కొట్టింది భారత జట్టే. 2007 ఫిబ్రవరి 17న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ(Rohit Sharma) 148తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండో అత్యధిక స్కోర్..351/4. మూడో అత్యధికం.. 350/6. సో.. గత రెండు మ్యాచుల్లో మాదిరిగానే మూడో వన్డేలోనూ 350 ప్లస్ స్కోర్ ఖాయమనిపిస్తోంది.
టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ 52వ సెంచరీతో కదం తొక్కగా .. రోహిత్ శర్మ, కెప్టెన్ రాహుల్ అర్థ శతకాలతో మెరిసి భారీస్కోర్ అందించారు. ఆఖర్లో దంచేసినా.. ఉత్కంఠ పోరులో 17 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది.
South Africa win the 2nd ODI by 4 wickets.
We go to Vizag with the series levelled at 1-1.
Scorecard ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/rGOhm95NnI
— BCCI (@BCCI) December 3, 2025
రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్(105), కోహ్లీ(102) శతకగర్జనకు సారథి రాహుల్ ఫిఫ్టీ తోడవ్వగా.. మరో 9 పరుగులు ఎక్కువే చేసినా బౌలర్లు తేలిపోవడంతో మ్యాచ్ పోయింది. మర్క్రమ్ (110) సెంచరీతో విజృంభించగా.. కుర్రాళ్లు డెవాల్డ్ బ్రెవిస్(54), మాథ్యూ బ్రీడ్జ్(68)లు కుమ్మేశారు. 49.2 ఓవర్లకే సఫారీ జట్టు లక్ష్యాన్ని అందుకుంది. దాంతో.. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో మరోమారు తగ్గపోరు ఖాయమనిపిస్తోంది.