తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు కావస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఇసుమంతైనా సంతృప్తి కనపడటం లేదు? పైగా ముందున్న మూడేండ్ల కాల పరిమితి పక్కనబెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘విజన్-2047’ గురించి ప్రణాళికలు రచించడం చూస్తుంటే ప్రజలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 420 వాగ్దానాలను పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగణం ఇప్పుడు విద్య, వైద్యరంగాల అభివృద్ధి పేరిట సరికొత్త రాగం అందుకుంటున్నది. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తానేమీ తీసిపోనని తియ్యటి నినాదాలను ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తామని యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ‘రాజీవ్ యువ వికాస పథకం’ పేరుతో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల సహకారంతో సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని విస్తృత ప్రచారం చేశారు. దీంతో యువత నుంచి రూ.16 లక్షపై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. యూనిట్లు, శిక్షణలంటూ హడావుడి చేసి ఊరించి, ఉరికించి ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు? ఇక ఇటీవల తాజాగా కోటి మంది ఆడబిడ్డలను ‘కోటీశ్వరులు’గా చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. అందుకు, వడ్డీ లేని రుణ పథకాన్ని పావుగా వాడుకుంటున్నారు. తీరా రూ.350 కోట్లు మాత్రమే రుణా లు మంజూరు చేసి మమ అనిపించారు. కల్యాణలక్ష్మీ పథకం కింద అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇప్పటికే తుస్సుమన్నది. ఇక చదువుకునే ఆడబిడ్డలకు ఇస్తామన్న స్కూటీలకు దిక్కులేదు? మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న సంగతి మరిచారు? ఇక కేసీఆర్ బతుకమ్మ చీరనే ఇందిరమ్మ చీర అయింది. మొత్తంగా మసిపూసి మారేడుగాయ చేసే పరిస్థితి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది.
ఆయా శాఖల మంత్రులు కూడా అభివృద్ధి పథకాలను ప్రకటనలకే పరిమితం చేశారు తప్ప ఆచరణలో ఒక్క అడుగు ముందుకువేయటం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖర్చుచేయడానికి ఉద్దేశించిన నిధులు సైతం ఇంతవరకు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే 2024 నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, తాము జీవితకాలం పొదుపు చేసి దాచుకున్న సొమ్మును వాడుకున్న ప్రభుత్వం సుమారు రూ.7 వేల కోట్ల బకాయిలను చెల్లించడం లేదు. ఫలితంగా ఇప్పటివరకు పదుల సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక ప్రైవేటు విద్యాలయాలకు చెల్లించవలసిన ఫీజు రీ యింబర్స్మెంట్ బ కాయిలు మరో రూ.6 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీల బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన బకాయిలు, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు సంగతి దేవుడెరుగు!
ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పటికీ, ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా విలీనం చేసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇక నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వాగ్దానాలు పక్కకుపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిక్స్డ్ రేట్లు, వసూళ్ల ద్వారా అవినీతి కొనసాగుతున్నది. ఇక ప్రభుత్వ పని విధానంలో దిగువ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు కమీషన్ల వ్యవహారం ప్రజల్లో బహిరంగ చర్చ అవుతున్నది. రేవంత్ రెడ్డి సలహాదారుల జోక్యం పరిపాలనలో పరిధి దాటుతుందనే విమర్శలున్నాయి. ఇక రెవెన్యూ శాఖల్లో అవినీతి గురించి ప్రత్యక్షంగా చెప్పనక్కరలేదు. సమగ్ర భూ సర్వే ద్వారా రైతుల భూ కమతాల స్థిరీకరణ ఊసే మరిచారు. చట్టాలను సరళీకరణ చేయడానికి బదులు మరింత క్లిష్టంగా మార్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రుణమాఫీ కూడా వివిధ అడ్డంకులతో 30 శాతం రైతులు రుణమాఫీ జరుగకపోగా, ఎన్నికల ముందు కల్పించిన ఆశల వల్ల మోయలేని రుణభారం వారికి పెరిగింది.
ముఖ్యమంత్రి రెండేండ్ల ప్రస్థానం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, చేతలు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రి రెండేండ్లుగా హైదరాబాద్, ఆ పరిసరాల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ గ్రామీణ ప్రాంతాలను కనీసం పట్టించుకోవడం లేదు. మనకు ఉమ్మడిగా చీలివచ్చిన పది జిల్లాలు 33 జిల్లాలుగా తెలంగాణలో ఉనికిలో ఉన్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియని విషయం కాదు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తొలగింపు, సమైక్యాంధ్ర బలపర్చిన సినీ హీరోలకు అవార్డులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎగవేతలతో ముగిసిన రెండేండ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని ముందున్న మూడేండ్ల కాలానికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకుసాగాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొంతలో కొంతైనా నెరవేర్చడానికి ప్రయత్నం చేసి, ప్రజలను సంతృష్టులను చేస్తారని ఆకాంక్షిద్దాం. చిన్న వయస్సులోనే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆయన రాజకీయ భవితవ్యం మాటలతో కాకుండా, ఆచరణతో ముడిపడి ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారని ఆకాంక్షిద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-ఎన్.తిర్మల్
94418 64514