Depression | పూర్వం ప్రజలు ఎలాంటి మానసిక అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అప్పట్లో వాళ్లకు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ అంటే అసలు తెలియదు. రోజంతా శారీరక శ్రమ చేసేవారు. రాత్రికి హాయిగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం అంతా బిజీ యుగం నడుస్తోంది. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక రకాల పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అలాగే కుటుంబ సమస్యలు కూడా ఉంటున్నాయి. అనేక రకాల సమస్యలతో ప్రస్తుతం సగటు మానవుడు కొట్టు మిట్టాడుతున్నాడు. దీంతో చాలా మందికి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వచ్చి మానసికంగా కుంగిపోతున్నారు. చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపం చెంది బలవంతంగా ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. అయితే మానసిక సమస్యలు వచ్చేందుకు ఇవే కాదు, ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.
మానసిక సమస్యలు వచ్చేందుకు శరీరంలో జరిగే రసాయనిక చర్యలు కూడా కారణం అవుతాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. శరీరంలో అనేక రకాల రసాయన చర్యలు సక్రమంగా నిర్వహించబడితే ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు ఉండవు. కానీ రసాయనిక చర్యలు సరిగ్గా జరగపోతే అప్పుడు శరీరం మానసికంగా, శారీరకంగా రోగాల బారిన పడుతుంది. ముఖ్యంగా సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల చర్యలు సరిగ్గా లేకపోతే ముందుగా మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇక వంశ పారంపర్యంగా కూడా డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొందరికి ఈ సమస్య తరతరాలుగా వంశ పారంపర్యంగా అలాగే వస్తుందని కూడా మానసిక వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉన్నా కూడా డిప్రెషన్ బారిన పడతారు. కొందరికి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ సమస్యలు వచ్చేందుకు కారణం అవుతాయి. చుట్టూ ఏవైనా తట్టుకోలేని సంఘటనలు జరిగితే కొందరు డిప్రెషన్ బారిన పడతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలోనూ డిప్రెషన్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా మానసిక అనారోగ్య సమస్యలు వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి.
డిప్రెషన్ బారిన పడిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బ తిన్నదని సులభంగా గుర్తించవచ్చు. డిప్రెషన్ ఉంటే ఎల్లప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంటారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. మూడీగా ఉన్నట్లు కనిపిస్తారు. చుట్టూ ఎంత ఆనందకరమైన వాతావరణం ఉన్నప్పటికీ వారు అసలు ఫీల్ కాలేరు. తీవ్రమైన విషాదంలోనే ఉన్నట్లు ఫీలవుతారు. అలాగే ఏదో తప్పు చేశామన్న భావన కూడా వారిలో ఉంటుంది. దీని వల్ల వారు ఇతరులతో సరిగ్గా మాట్లాడరు. మాట్లాడించినా ముక్తసరిగా సమాధానం చెబుతారు. ఇక డిప్రెషన్ ఉంటే సడెన్‌గా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. కొందరికి తిండి అంటే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తీవ్రమైన అలసట, నీరసం కూడా ఉంటాయి. డిప్రెషన్ ఉన్నవారు నిద్ర కూడా సరిగ్గా పోలేరు. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రత ఉండదు. నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఏ విషయాలను కూడా సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. మాటలు నెమ్మదిగా మాట్లాడుతారు. ఇక కొందరికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. ఎల్లప్పుడూ చావు గురించే ఆలోచిస్తారు. ఇలా డిప్రెషన్ వచ్చిన వారిని చాలా సులభంగా గుర్తించవచ్చు.
డిప్రెషన్ లేదా మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పలు ఆహారాలను ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చు. దీంతో వారి మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందుకు గాను పలు పోషకాలు ఉండే ఆహారాలను వారు తినాల్సి ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, రొయ్యలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలను తింటుండాలి. ఇవి డిప్రెషన్‌ను తగ్గేలా చేస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే పాలు, కోడిగుడ్లు, చీజ్, అరటి పండ్లు, పాలకూర, పప్పు దినుసులు, బీన్స్, ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కినోవా, చిలగడదుంపలు, పెరుగు, నారింజ పండ్లు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ డిప్రెషన్‌ను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఎంతో సహాయం చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే ఈ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.