ACB Raids | మాగనూరు (కృష్ణ) డిసెంబర్ 03 : నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామశివారులో ఉన్న వసుధ రైస్ మిల్లులో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో కేసు నమోదైందని తెలిపారు. ఇందులో భాగంగానే ఆయన ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, సహచరులకు సంబంధించి ఆరు ప్రదేశాల్లో సోదాలు చేసినట్లు తెలిపారు.
సోదాల్లో రాయదుర్గ్‌లోని మైహోం భుజాలో ఒక ప్లాట్, నారాయణపేట జిల్లా హిందుపూర్ శివారులో కోట్ల విలువైన ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రైస్ మిల్, కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో మూడు ప్లాట్లకు సంబంధించిన దస్త్రాలు గుర్తించినట్లు తెలిపారు. ఆయన సోదరుల ఇండ్లల్లో రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, ఒక కియా కారు, ఇన్నోవ కారు ఉన్నాయన్నారు. స్థిర చరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. తనిఖీల్లో సీఐ ఆకుల శ్రీనివాసులు, సిబ్బంది నారాయణపేట, జిల్లా సివిల్ పౌరసరఫరాల డీటీ గురు రాజారావు తదితరులు పాల్గొన్నారు.