e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home Top Slides మన తెలంగాణ.. రాతి పూల వనం

మన తెలంగాణ.. రాతి పూల వనం

శాంతినికేతన్‌ బాధ్యతలు లేకపోయి ఉంటే ఇక్కడే ఈ రాళ్ల మధ్యే నివాసం ఏర్పరచుకునేవాడిని అని బంజారాహిల్స్‌ రాళ్ల సౌందర్యం గురించి రవీంద్రనాథ్‌ టాగోర్‌ ‘కోహ్సార్‌’ అనే కవితలో 1933లో వర్ణించాడు. రాతి యుగం మానవుల నుండి టాగోర్‌ వరకు జీవితాన్ని, ఆత్మిక సౌందర్యాన్ని అందించిన శిలలు తెలంగాణ అంతటా పరచుకుని ఉన్నాయి. హిమాలయాల కంటే, అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ కంటే ముందు పుట్టిన రాతి నేల మీద మన తెలంగాణ నాగరికత మొలిచి నిలిచింది. నదికీ నాగరికతకు సంబంధం ఉన్నట్టే రాళ్లకూ మానవ వికాసానికీ అవినాభావ అనుబంధం ఉంది.

మన తెలంగాణ.. రాతి పూల వనం

ప్రైమేట్స్‌ (వానరజాతికి చెందిన మన
పూర్వీకుల) నుండి పరిణామం చెందుతున్న క్రమంలో మానవులు చెట్లు దిగి అడవుల అంచుల్లోని పచ్చిక బయళ్లు, కొండలు, గుట్టలనే తమ నివాసాలుగా మార్చుకున్నారు. అప్పటి నుండి మనకు అండగా నిల్చిన ఈ రాతి గుట్టలు.. ఇప్పుడు కొండలు పిండి చేసి మనం నగరాల్ని, కాంక్రీట్‌ అరణ్యాల్ని నిర్మించుకుంటున్న వరకు మన జీవనాధారం అయినాయి. రాతియుగంలో మానవ సమూహాలు తలదాచుకునేందుకు ఆసరాగా ఉన్న ఈ రాతి గుట్టలే మిగతా జంతువుల నుండి, హిమయుగాల్లో ఎముకలు కొరికే చలి నుండి, భానుడు నిప్పులు చిమ్మే సమయాల్లో వేడి నుండి రక్షణనిచ్చాయి. మనిషి మరింత అభివృద్ధి చెంది గ్రామాలను, నగరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఈ శిలలు ఇళ్ల నిర్మాణంలో, ఎత్తైన కోటలకు వేదికగా, చివరికి సమాధుల మీది బండరాళ్లుగా కూడా ఉపయోగపడ్డాయి.

- Advertisement -

బౌద్ధ స్తూపమైనా, జైన బసది అయినా, వైదిక మందిరమైనా రాయి లేనిదే లేదు. నిర్మాణ కళ పెరిగేకొద్దీ రక రకాల రాళ్లు శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల్లా కరిగి సుందర శిల్పాలైనాయి. గుట్టలు, గుహలు మన పురాతత్వ మ్యూజియంలు.

రాళ్లకు పురాతత్వ శాస్ర్తానికి ఏమిటి సంబంధం?
రాళ్లను, భూమి గర్భంలో దాగి ఉన్న ఖనిజాలు, శిలలు, జల ప్రవాహాలు తయారు చేస్తున్న నేలలను పరిశీలించడం- ఇవన్నీ పురాతత్వ పరిశోధనలో భాగమే. ఎందుకంటే రాతి యుగపు ఆధారాలు మనకు కొండల్లో, గుట్టల్లో, గుహల్లోనే దొరుకుతాయి. పాత రాతి యుగం నుండి కొత్త రాతి యుగం వరకు వాళ్లు చేసుకున్న పనిముట్లు, ఆ రాళ్ల మీద గీసుకున్న చిత్రాలు, కేవలం వారి ఉనికినే కాదు.. వారి కాలానికి సంబంధించిన చరిత్రని కూడా మన ముందుంచుతాయి. ఉదాహరణకు గుట్టల్లో మనకు కనిపించే పొడుగైన గుంతలు (గిల్లిదండా లేదా చిర్రగోని ఆట గుంతల లాంటివి) కొత్త రాతి యుగం మానవులు పనిముట్లు చేస్తున్నప్పుడు ఏర్పడినవి. గుహలు, పడగ రాళ్ల గోడల మీది ఎరుపు, తెలుపు వంటి వర్ణ చిత్రాలు వాటిలో చిత్రీకరించిన జంతువులు, వివిధ ఆకృతులు, డిజైన్లు నాటి చరిత్రను చెపుతాయి.

సుమారు 160 కోట్ల ఏళ్ల కిందటి మీసోప్రోటెరోజోయిక్‌ కాలానికి చెందిన అవక్షేప ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా భీమా బేసిన్‌లోని కోటుపల్లి, తాండూర్‌ ప్రాంతాలు. అక్కడ దొరికే షాబాద్‌ రాళ్లు ఆ కాలానివే. నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో కృష్ణా నదికి అటు ఇటు, పల్నాడు బేసిన్‌లో సున్నపురాయి (లైం స్టోన్‌) ఉంది.

మన తెలంగాణ.. రాతి పూల వనం

పల్నాడు బేసిన్‌, భీమా బేసిన్‌ రెండింటిలో కూడా సిమెంట్‌ గ్రేడ్‌ లైం స్టోన్‌, బిల్డింగ్‌ స్టోన్‌ దొరుకుతాయి. నాగార్జున సాగర్‌ పరిసరాల్లో ఇసుక రాయి (సాండ్‌ స్టోన్‌), శ్రీశైలంలో క్వార్ట్‌ జైట్‌ ఉంది. ఈ క్వార్ట్‌ జైట్‌ శిలల కింద యురేనియం వంటి అటామిక్‌ మినరల్స్‌ ఉండటం విశేషం. ఇదే ప్రోటోరోజోయిక్‌ కాలానికి చెందిన సున్నపురాయి మంచిర్యాల నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు, ఇటు ఖమ్మం వరకు విస్తరించి ఉన్న పాఖాల్‌ బేసిన్‌లో విస్తారంగా ఉంది. ఇక్కడ కూడా డోలమైట్‌ లైం స్టోన్‌, బిల్డింగ్‌ స్టోన్‌ దొరుకుతుంది. పాఖాల బేసిన్‌ పైనున్న సులవాయి బేసిన్‌ దానిపై పెన్‌ గంగ – ఇవన్నీ షేల్‌ మరియు సున్నపురాయి ప్రాంతాలే.

55 కోట్ల ఏళ్ల నుండి 18 కోట్ల ఏళ్ల మధ్య భూమి ఇప్పుడు మనం చూస్తున్నట్టు లేదు. భారతదేశం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా అన్నీ కలిసి ఒకే భూఖండంగా ఉండింది. దానిని గోండ్వానా సూపర్‌ కాంటినెంట్‌ అంటారు. ఈ గోండ్వానా కాలానికి చెందిన అవక్షేపాలు ఉత్తర తెలంగాణలోని గోదావరి లోయలో ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఉన్న శిలలు మొదలు మొత్తం తెలంగాణ అంతటా ‘జాతీయ స్థాయి జియోలాజికల్‌ మాన్యుమెంట్స్‌’గా ప్రకటించదగ్గ స్థలాలు ఎన్నో ఉన్నా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించిన 34 నేషనల్‌ జియోలాజికల్‌ మాన్యుమెంట్స్‌లో తెలంగాణలోని ఒక్క ప్రదేశం కూడా లేదు. కోల్‌ బెల్ట్‌ ప్రాంతంలో.. పేలియోజోయిక్‌ హిమయుగంలో అంటే 32 కోట్ల ఏండ్ల నుండి 29 కోట్ల ఏండ్ల వరకు పరుచుకున్న దట్టమైన మంచు పొరల వల్ల ఏర్పడ్డ శిలల ఆధారాలు తాల్చేర్‌ బెడ్స్‌ రూపంలో ఉన్నాయి. దశాబ్దాలుగా విస్మరణకు గురైన అనేక విషయాల్లో ఇది ఒకటి. హైదరాబాద్‌లోని నౌబత్‌ పహాడ్‌ (బిర్లా మందిర్‌ ఉన్న కొండ), మౌలాలి గుట్ట మీద డైక్‌… ఇలాంటివి ఎన్నో విశిష్టతలతో ఏర్పడ్డ సహజ శిలలు, భూభాగాలు ఉన్నాయి.

రాతిపూల తోట మన హైదరాబాద్‌
ఒంటె తల, ఏనుగు రాయి, ఫామిలీ గ్యాదరింగ్‌ (కుటుంబ కలయిక), క్లోజ్‌ ఫ్రెండ్స్‌, తల్లీ-పిల్లా, భారీ లడ్డూ – నగరంలో నాలుగు దిక్కులా వివిధ ఆకృతుల్లో ఒకదానిపై ఒకటి వయ్యారంగా, జిమ్నాస్టిక్స్‌ చేస్తూ నిలుచుని ఉన్న 25కు పైగా శిలల సమూహాలకు, అనేక శిలలకు శిలా ప్రేమికులు పెట్టుకున్న పేర్లు ఇవి. సుమారు 250 కోట్ల ఏండ్ల కింద ఏర్పడ్డ ఈ శిలలు శతాబ్దాలుగా నగరానికి వచ్చిన అతిథుల్ని అబ్బుర పరుస్తూనే ఉన్నాయి. 1820లో హైదరాబాద్‌లో బ్రిటిష్‌ అసిస్టెంట్‌ రెసిడెంట్‌గా పని చేసిన మీడోస్‌ టేలర్‌ రాసిన ’కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ థగ్‌’ నవలలో (థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ పేరుతో హిందీ సినిమాగా వచ్చింది) నగరంలోని రాళ్లని వర్ణిస్తాడు. తెలంగాణలో రాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్లు ఈ రాళ్లలో చూడొచ్చు. మౌలాలి గుట్ట మీద రాతి యుగపు ఆనవాళ్లు, బృహత్‌ శిలా యుగపు సమాధులు దొరికినయి. కోకాపేటలో మధ్య రాతి యుగపు చిత్రాలు ఇప్పటికీ ఉన్నయి. చైతన్యపురి దగ్గర మూసీ నది ఒడ్డున ఉన్న గుట్టపై విష్ణుకుండినుల కాలంలో బౌద్ధ విహారం విలసిల్లింది. ఇక గోల్కొండ కోట ఒక పెద్ద గుట్ట మీద కట్టిందే. ఇప్పటివరకు తెలంగాణలో వెలుగులోకి వచ్చిన సుమారు 50 రాతియుగం నాటి చిత్రాల తావులు మన పురాతన మ్యూజియంలుగా నిలిచాయి.

కాలం కట్టిన శిలా తోరణాలు
తిరుమల కొండల్లో ఉన్న శిలాతోరణం లాంటిదే మన తెలంగాణలో కూడా ఉంది. అతి తక్కువ మందికి తెలిసిన ఈ శిలా తోరణం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పాండవుల గుట్ట మీద ఉంది. సుమారు 40 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డ ఈ శిలా తోరణాన్ని ప్రచారంలోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరో చిన్న శిలాతోరణం అదే జిల్లా మైలారం గుట్టల్లో ఉంది. 1990లో వెలుగులోకి వచ్చిన ఈ పాండవుల గుట్టల్లో పాత రాతియుగం కాలం నుండి కాకతీయుల కాలం వరకు వేసిన చిత్రాలున్నాయి.

కోట్ల ఏండ్ల పాటు ఎన్నో మూలకాలు, ఖనిజా లు సమ్మిళితం చెందుతూ శిలలుగా మారినయి. ఈ శిలలే తనపై ఆధారపడ్డ మానవ జీవితాన్ని కూడా రికార్డు చేసుకున్నయి. అందు కే పురాతత్వ పరిశోధకులకు ఈ కొండలు, గుట్టలు ఏదో ఒక కథ చెపుతూనే ఉంటా యి. ఇప్పుడు వీటిని మనం సందర్శన స్థలాలుగా, మాన వ నాగరికత పరిణామాన్ని చూపే మ్యూజియంలుగా, కాలంతో ప్రకృతి సంగమించి కన్న కళాకృతులుగా భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ రాళ్లు ఎలా పుట్టినయి?
మొద్దు రాయిలా అక్కడే పడి ఉంటాడు అని సోమరిపోతులను అంటుంటారు. కానీ వందల కోట్ల సంవత్సరాల్లో రాళ్లు చెందిన మార్పుల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మనిషి వయసుతో పోల్చుకుంటే శిలల వయసు చాలా చాలా ఎక్కువ. ఆ సుదీర్ఘకాలంలో వాటిలో అనేక మార్పులు సంభవించాయి. తమను సోమరిపోతులతో పోలిస్తే అవి సిగ్గు పడతాయి. సుమారు 250 కోట్ల ఏళ్ల కింద భూమండలంపై ఏర్పడిన మార్పులు క్రమంగా మనం ఇప్పుడు చూస్తున్న రకరకాల ఆకృతుల్లో ఉన్న శిలలకు కారణమైనాయి. ఇవి అగ్ని పర్వతపు లావాతో ఏర్పడిన శిలలు. ఈ శిలలు ఆర్కియన్‌ కాలం నుండి అంటే 400 కోట్ల ఏళ్ల నుండి క్వార్టర్నరీ కాలం అంటే సుమారు 26 లక్షల ఏళ్ల వరకూ.. ఆ తర్వాత నుండి నేటి వరకు ఎన్నో మార్పులు చెందినయి. తెలంగాణ భూమిపై ఈ కాలపు మార్పులు అన్నీ రికార్డు అయి మనకు వివిధ ప్రాంతాల్లో రకరకాల రాళ్లుగా దొరుకుతున్నాయి.

భూమిని తొలుచుకొని లేచిన భువనగిరి
ఈ సందర్భంగా మన భువనగిరి గుట్ట గురించి మాట్లాడుకోవాలి. భువనగిరి గుట్టను భూగర్భశాస్త్ర పరి భాషలో బాతొలిత్‌ అంటారు. భూమి లోపలి నుండి శిలాద్రవం (మాగ్మా) బయటకు చిమ్మి, అది గట్టి పడిన తర్వాత ఏర్పడినవే ఈ బాతొలిత్‌లు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఉన్న షుగర్‌ లోఫ్‌ మౌంటెన్‌, ఆస్ట్రేలియాలోని ఉలురు ఇలాంటివే. కాకపొతే భువనగిరి కంటే పెద్దవి.

సుమారు 72 కిలో మీటర్లు భూగర్భంలో వ్యాపించి, భువనగిరి దగ్గర దాదాపు 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ ఒక భూగర్భశాస్త్రపు విశేషం. నరసింహ క్షేత్రమైన యాదాద్రి, ట్యాంక్‌బండ్‌ పైనున్న బుద్ధ విగ్రహానికి అవసరమైన శిలను అందించిన రాయగిరి, ఈ భువనగిరి కొండ నిరంతరతగా తోస్తుంది. ఇలా భూమిని తొలుచుకువచ్చిన భువనగిరి కొండవాలులో 1921-24లో నిజాం ప్రభుత్వ ఆర్కియాలజీ శాఖ చేసిన పరిశీలనలో మధ్య రాతి యుగపు పనిముట్లు దొరికాయి. క్రీస్తు శకం 1076లో పాలించిన కళ్యాణి చాళుక్య రాజు ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలంలో ఈ కొండపై కోట నిర్మాణం జరిగింది. నునుపుగా ఉండి శత్రుదుర్భేద్యమైన భువనగిరి కొండపైన కోట కళ్యాణి చాళుక్యుల నుండి సర్దార్‌ సర్వాయి పాపన్న వరకు మధ్య యుగపు రాజ్యాల సైనిక అవసరాలను తీర్చింది. చదునుగా ఉన్న దక్కన్‌ పీఠభూమి పై ఇలా తొలుచుకువచ్చిన కొండలు, గుట్టలు, మన చరిత్రలో బౌద్ధ విహారాలకు, జైన బసదులకు, వైదిక ఆలయాలకూ, కోటలకు, బురుజులకు నెలవై కొన్ని వేల ఏళ్ల చరిత్రను తమపై నిలుపుకొన్నాయి.

ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మన తెలంగాణ.. రాతి పూల వనం
మన తెలంగాణ.. రాతి పూల వనం
మన తెలంగాణ.. రాతి పూల వనం

ట్రెండింగ్‌

Advertisement