e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఎడిట్‌ పేజీ అరే వో సాంబా… రాస్కోరా డబల్‌ స్టేట్‌మెంట్‌

అరే వో సాంబా… రాస్కోరా డబల్‌ స్టేట్‌మెంట్‌

అరే వో సాంబా… రాస్కోరా డబల్‌ స్టేట్‌మెంట్‌

బొర్రయ్య శెట్టి పరుగు పరుగున వచ్చాడు. గురువు గారూ ఆలస్యం అయిందా అని రొప్పుతూ అన్నాడు. అవును శిష్యా రేపటి పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో మన స్టేట్‌మెంట్లు రావాలంటే కాస్త ముందుగానే పంపాలి కదా. ఇంకా ఆలస్యమైతే మన స్టేట్‌మెంట్లు చద్దివి కావూ అన్నాడు జంఘాల శాస్త్రి. ఇవాళటి డబల్‌ స్టేట్‌మెంట్లు రాసుకో అని తాపీగా అన్నాడు తిరిగి నిమ్మళపడుతూ. గురువు గారూ ఇవాళటి స్టేట్‌మెంట్లు కూడా శకటస్వాముల వారివేనా. అవును శిష్యా.. బహుళ జిహ్వుల వారు వారే కదా.

జంఘాల శాస్త్రి: రాసుకో స్టేట్‌మెంటు 1. కరోనా కరాళ నృత్యం చేస్తూ ఉంది, జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలు కుటుంబాలే కూలిపోతున్నాయి. మందులు బ్లాక్‌ మార్కెట్‌ అవుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వాధిపతి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. ప్రగతిభవన్‌ను వదిలిపెట్టి బయటికి రావడం లేదు. ఏ ఆసుపత్రికైనా వెళ్లి రోగులను పరామర్శించాడా. ఈయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు కాడా.

బొర్రయ్య శెట్టి: గురువు గారూ ఇప్పుడు పరిస్థితి అది కాదు. పెద్దాయన రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారని పత్రికలు, టీవీ మాధ్యమాలు చెప్పాయి కదా. చాలా మెచ్చుకున్నాయి కదా ఇప్పుడు మీ రెండో స్టేట్‌మెంటు ఏమిటి?

జంఘాల శాస్త్రి: రాసుకో స్టేట్‌మెంటు 2. కొవిడ్‌ జబ్బు చాలా తీవ్రమైన అంటువ్యాధి కదా ఈయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం ఏమిటి. కొవిడ్‌ తాను కూడా తెచ్చుకొని లేదా వచ్చిందని అబద్ధం చెప్పి ప్రజల దగ్గర సానుభూతి పొందాలనా? అయినా ఇంత ఆలస్యమా ఈయన సొంత పనులు అన్నీ పూర్తయిన తర్వాతనే ఇలా జనం దగ్గరికి వస్తారన్న మాట. అయినా టీకాల కోసం ప్రయత్నించాలి, మందులు బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా ప్రగతిభవన్‌లో ఉంటూనే పోలీస్‌ యంత్రాంగాన్ని పర్యవేక్షించాలి. కానీ రోజుకొక పట్టణానికి పోయి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వ ఖజానాకు బోలెడంత ఖర్చే కదా. ఈయన హెలీకాప్టర్‌లో తిరిగినా లేదా కాన్వాయ్‌తో తిరిగినా రోజుకు ఎన్నో కోట్లు ఖర్చవుతాయి. ఆ డబ్బుతో రోగులకు టీకాలు కొనవచ్చు లేదా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఏర్పాటుచేయడానికి వాడుకోవచ్చు. ఈ ఆసుపత్రి సందర్శనలన్నీ నా దృష్టిలో నాటకమే. ఈయన ఈ నాటకాలు ఇకనైనా మానుకుంటే మంచిది.

జంఘాల శాస్త్రి: అవును శిష్యా నీవు టీవీలలో చూశావు కదా ముఖ్యమంత్రి పీపీఈ కిట్‌ వేసుకొని వెళ్లాడా లేకుంటే మామూలు డ్రస్సులతోనే వెళ్లాడా.

బొర్రయ్య శెట్టి: ఏంటి గురువు గారూ నేను చూశాను. దీనికి కూడా డబల్‌ స్టేట్‌మెంటు ఉందా. ఆయన రోజూ వేసుకునే మామూలు డ్రెస్సులోనే వెళ్లారు.

జంఘాల శాస్త్రి: అయితే రాసుకో డబల్‌ స్టేట్‌మెంటు 1. మామూలు డ్రెస్‌లో వెళ్తే.. ముఖ్యమంత్రి అయిన ఈయన కొవిడ్‌ ఆసుపత్రికి సందర్శనానికి పోతే ఇలాగేనా పోయేది. పీపీఈ రక్షణ కిట్‌ వేసుకోకుండా పోవడం ఏమిటి? అంటే ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు. అంటే మీరు కూడా ఇలా కిట్‌ లేకుండా వెళ్లి కొవిడ్‌ రోగం తెచ్చుకోమని సలహా ఇస్తున్నారా? అసలు ఇలా వెళ్లి అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు, నర్సులకు ఏమి సందేశం చెప్పాలనుకున్నారు. మీరు కూడా పీపీఈ కిట్‌లు వెసుకోకుండానే రోగులకు సేవ చేసి రోగాలు తెచ్చుకోమని సందేశమా? అలా వైద్యులు కరోనా బారినపడితే దానికి ఆయన బాధ్యత వహిస్తాడా.
బొర్రయ్య శెట్టి: అయింది రాశా గురువు గారూ. రేపు ఆయన వరంగల్‌ లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శిస్తారు. అప్పుడు ఒకవేళ పీపీఈ కిట్‌ ధరించి వెళ్తే ఏమని స్టేట్‌మెంట్‌ ఇస్తారు.

జంఘాల శాస్త్రి: రాసుకో రెండో స్టేట్‌మెంట్‌. ముఖ్యమంత్రి అసలు ఏమనుకుంటున్నారు? కొవిడ్‌ రోగుల వద్దకు ఇలా పీపీఈ కిట్‌ వేసుకొని చంద్రమండలంలోనికి పోయే వ్యోమగామి లాగా పోవడమా? కొవిడ్‌ అంటే ఈయనకు అంత భయమైతే ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు? అంటే జనమంతా ఇలా భయపడిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలనా?. లేకపోతే ఎంత ఖర్చయినా రోగుల బంధువులు పీపీఈ కిట్లు కొనుక్కుంటేనే దవాఖానలోకి అనుమతించాలని చెప్పాలనుకున్నారా? అసలు అక్కడ జరిగే వైద్యం మీద వీరికే పూర్తి విశ్వాసం లేదని అనుకోవాలా? ప్రభుత్వం సొమ్మును ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేసే ఆలోచనలు ఎందుకు?.. ఇది రెండో స్టేట్‌మెంటు.

బొర్రయ్య శెట్టి: సరే గురువు గారూ ఈ స్టేట్‌మెంట్లు రేపటికి వచ్చేలాగా పంపిస్తాను.

జంఘాల శాస్త్రి: శకటస్వామి ఇంకా ఏయే డబల్‌ స్టేట్‌మెంట్లు ఇస్తే బాగుంటుందో, ఏమి ఉన్నాయి చెప్పు.

బొర్రయ్య శెట్టి: టీకాల విషయంలో ఏదైనా చెప్పడానికి వీలుంది గురువు గారూ.

జంఘాల శాస్త్రి: రాసుకో డబల్‌ స్టేట్‌మెంటు. 1. ప్రభుత్వం టీకాలు తనకై
తాను కొనాలని ఆలోచన చేయకుంటే ఇలా రాసుకో. ఏమి ప్రభుత్వం ఇది. ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడటమేనా?ముఖ్యమంత్రి ప్రతిదానికీ కేంద్రాన్ని నిందిస్తే ఎలా? టీకాలు సప్లయి చేయడం కేవలం కేంద్రానిదేనా బాధ్యత. రాష్ర్టానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్లోబల్‌ టెండర్లు పిలిచి టీకాలు కొనుగోలు చేసి ప్రజలకు ప్రాణరక్షణ కల్పించవచ్చు కదా. ప్రజల ప్రాణాల మీద అసలు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్లా, లేనట్లా. ఇలా రాయి.

బొర్రయ్య శెట్టి: గురువు గారూ ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచి టీకాలు కొనుగోలు చేయాలని సంకల్పిస్తే, అప్పుడు శకటస్వామి స్టేట్‌మెంట్‌ ఎలా ఉంటే బాగుంటుంది.

జంఘాల శాస్త్రి: రాసుకో రెండో స్టేట్‌మెంటు. ఇదేమిటీ టీకాల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవడమేమిటి? భారత దేశం టీకా తయారీలో ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉంది. ఇక్కడే అన్నిటికన్నా మంచి టీకాలు తయారవుతున్నాయి. మన దేశానికి ఆత్మ నిర్భరత అవసరం లేదా? కోట్ల డోసులలో టీకాలు మన దేశంలోనే శరవేగంగా తయారవుతుంటే ప్రజా ధనాన్ని వృథా చేస్తూ అత్యధిక ధరలకు ఇతరదేశాల టీకాలు కొనాలనే ఆలోచన ఈ ప్రభుత్వాధినేతకు ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడానికేనా, లేకపోతే ఏమన్నా ఇతర దేశాల ఫార్మసీ కంపెనీల నుంచి కమీషన్లు దండుకోవడానికే గ్లోబల్‌ టెండర్లు పిలుస్తున్నారా.. ఇలా రాయి.

బొర్రయ్య శెట్టి: గురువు గారూ ఈ స్టేట్‌మెంటు మరీ పొసగేలాగా లేదు. వేరే రాష్ర్టాల వారు కూడా గ్లోబల్‌ టెండర్లకు పోతున్నారు. మన దేశంలో టీకాలు మంచివే. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు సరిపడా డోసులు ఇవ్వలేక పోతున్నది. ఇలా మన దేశంలోని టీకాలపైనే ఆధారపడితే ఇంకా నాలుగైదేండ్లకు కూడా ప్రజల్లో కనీసం సగం మందికి కూడా టీకాలు అందవు. కాబట్టి ఇతర దేశాల నుంచి టీకాలు కొనడం మంచిదే కదా. ప్రజల ప్రాణాలు అలా నిలబెట్టవచ్చు కదా.

జంఘాల శాస్త్రి: శిష్యా ఆ సంగతి నాకు తెలియదా. అది మంచిదే. కానీ మన శకటేశ్వర స్వాముల వారు డబల్‌ స్టేట్‌మెంట్లు ఏ శైలిలో ఇస్తున్నారో తెలియజేయడానికే కదా ఈ ప్రయత్నం. శిష్యా. అయినా డబల్‌ స్టేట్‌మెంట్ల విషయంలో నేను చెప్పింది రాసుకో కానీ గురువుకే సలహాలు ఇవ్వకు. ఇక రేపు ఇచ్చే డబల్‌ స్టేట్‌మెంట్ల గురించి ఆలోచించాలి. కొత్త వార్తలు విశేషాలు పట్టుకురా.

అలా జంఘాల స్వాములవారు విశ్రాంతికి వెళ్లారు. బొర్రయ్య శెట్టి వార్తలు సేకరించడానికి బయల్దేరాడు.

  • వ్యాఘ్రనేత్రుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అరే వో సాంబా… రాస్కోరా డబల్‌ స్టేట్‌మెంట్‌

ట్రెండింగ్‌

Advertisement