రాజు కన్నా మొండివాడు బలవంతుడంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు లక్షణాలూ కలగలిసిన వ్యక్తి. ప్రజాస్వామిక పాలకునిలా కాకుండా రాజరికపు ఫర్మానాల తరహాలో పాలించడమంటే ఆయనకు ఇష్టం. ఆయన వ్యవహారశైలిని గమనించిన వారెవరికైనా ఇది చిరపరిచితమే. చతుర్విధోపాయాల్లో ఆయనకు దండోపాయమంటేనే ఎక్కువ మక్కువ. ఇష్టారాజ్యంగా ఆయన ప్రయోగిస్తున్న టారిఫ్‌లు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నా, చివరకు అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆయన పట్టించుకోరు. 1977లో వచ్చిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ప్రయోగించిన మొదటి అధ్యక్షుడు ఆయనే.
ఎడాపెడా సుంకాలు బాదిన అధ్యక్షుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. కాకపోతే ఆ టారిఫ్‌లు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యే ప్రమాదం ఎదురవుతున్నది. తాజాగా ఆయన విధిస్తున్న టారిఫ్‌లు చట్టవిరుద్ధమని న్యాయస్థానం తీర్పు చెప్పడమే కాకుండా, టారిఫ్‌లను విధించే అధికారం రాజ్యాంగం కేవలం కాంగ్రెస్‌కే కట్టబెట్టిందని స్పష్టంచేసింది. టారిఫ్‌లు పన్నుల నిర్వచనంలోకి వస్తాయని, పన్నులను నిర్ణయించే బాధ్యత కాంగ్రెస్‌దే అని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తేల్చిచెప్పింది. పరిపాలనా వ్యవస్థ కట్టుతప్పి వ్యవహరిస్తే మొట్టికాయలు వేసి మూలకు కూర్చోబెట్టడంలో న్యాయవ్యవస్థ ప్రాముఖ్యం తెలిసేది ఇలాంటి సందర్భాల్లోనే.
ఇండియాపై ట్రంప్ 25 శాతం సాధారణ సుంకం, రష్యా దగ్గర చమురు, ఆయుధాలు కొంటున్నందుకు అదనంగా మరో 25 శాతం జరిమానా సుంకం, మొత్తంగా 50 శాతం బాదుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, వ్యవసాయరంగం ఈ సుంకాల బరువు వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఆ దూకుడుకు కళ్లెం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుత కీలక కోర్టు తీర్పు తక్షణమే అమల్లోకి రాదు. అక్టోబర్ 14 వరకు సుం కాలు అమల్లో ఉంటాయి. ఈలోగా దాఖలయ్యే అప్పీళ్లు అన్నిటిని కలిపి తర్వాత సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ప్రస్తుత తీర్పును ట్రంప్ సహజంగానే కొట్టిపారేశారు. వామపక్ష భావాలు కలిగిన జడ్జీలు దేశ వ్యతిరేక తీర్పునిచ్చారని మండిపడ్డారు. టారిఫ్‌లు విధించకపోతే అమెరికా ఆర్థిక, సైనిక శక్తి నిర్వీర్యమైపోతుందని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఈ తీర్పు ఫలితంగా అమెరికాతో పలుదేశాలు జరుపుతున్న వాణిజ్య చర్చలు డోలాయమానంలో పడ్డాయి. భారత్, బ్రెజిల్ తదితర బాధిత దేశాలు సహజంగానే వేచిచూసే ధోరణి ఎంచుకున్నాయి.
ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై పడింది. అమెరికా సర్వోన్నత న్యాయస్థానంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు రిపబ్లికన్ అధ్యక్షుల ద్వారా నియమితులైనవారే. అందులో ముగ్గురు స్వయంగా ట్రంప్ ఆమోదముద్రతో ధర్మపీఠాలెక్కినవారే. వారంతా ట్రంప్‌ను, ఆయన దుందుడుకు, దుస్సాహసిక విధానాలను గుడ్డిగా సమర్థిస్తారా? లేక రాజ్యాంగం సూచించిన అధికార విభజన సిద్ధాంతం వైపు మొగ్గుచూపి టారిఫ్‌లను కొట్టివేస్తారా? అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ మెజారిటీ న్యాయమూర్తులు ట్రంప్‌కే జై కొడితే అప్రకటిత రాజరికంలోకి అమెరికా కూరుకుపోయినట్టే అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటం గమనార్హం.