ఒకే రోజు రెండు వార్తలు. ఒకటి ప్రజలకు ఉపశమనం కలిగించేది. మరొకటి భారం మోపేది. మొదటిది తెలంగాణ సర్కారుదైతే.. రెండోది మోదీ సర్కారుది. రెండూ కరెంటు రంగానికి సంబంధించిన వే. వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీల రూపంలో డిస్కంలు వసూలు చేయాల్సిన రూ.12,718 కోట్ల భారీ మొత్తాన్ని మొత్తంగా తానే భరిస్తానని, వినియోగదారులపై ఎటువంటి భారం మోపవద్దని తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అవన్నీ ఏండ్లుగా పేరుకున్న బకాయిలు. కొన్నయితే తెలంగాణ ఏర్పాటు కాకముందువి కూడా. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో మొత్తం భారాన్ని తమ పైనే వేసుకొని తెలంగాణ వాసులకు ఎంతో ఉపశమనం కలిగించారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీలోని కేంద్రం నుంచి జనం నెత్తిన మరో పిడుగు పడింది. కరెంటు వినియోగం అధికంగా ఉండే (పీక్) సమయాల్లో యూనిట్ ధరలను పెంచాలని రాష్ర్టాలకు మోదీ ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.
విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అందులోనూ తన మిత్రులకు కట్టబెట్టడానికి మోదీ సర్కారు తొలినుంచీ అనేక ప్రయత్నాలు చేస్తు న్నది. దాంట్లో భాగంగానే విద్యుత్ సంస్కరణల బిల్లును తీసుకొచ్చిం ది. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించాలనే ప్రతిపాదన తెచ్చిం ది. స్మార్ట్ మీటర్లను పెట్టాలని పేర్కొన్నది. వీటిని అమలుచేస్తే ఎఫ్ఆర్ బీఎం పరిమితిని కూడా పెంచుతామని రాష్ర్టాలకు ఆశ చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని నిర్దంద్వంగా వ్యతిరేకించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. మౌలికరంగాల్లో పెద్ద ముందంజ వేస్తున్న రాష్ర్టానికి నిధులు, రుణాలు ఎంతో అవస రం. కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నది. ఇటువంటి క్లిష్ట సమయం లో కూడా సాగు మోటార్లకు మీటర్ల ప్రతిపాదనను వ్యతిరేకించి, వేల కోట్ల రుణాలు తీసుకునే అవకాశాన్ని కేసీఆర్ పక్కనపెట్టారు. రైతు సంక్షేమానికి అంతటి ప్రాధాన్యం ఇచ్చారు.
తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు విద్యుత్ సంస్కరణలను వ్యతి రేకించాయి. కరెంటు విభాగాల ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమ్మె లకు దిగారు. ఇటీవలే యూపీలో ఉద్యోగులు కూడా ఉద్యమ మార్గం పట్టారు. ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా కేంద్రం తన ఏకపక్ష విధానాన్ని మార్చుకోలేదు. వ్యవసాయ మోటర్లకు మీటర్లను బిగించే ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఏపీలోని ఉత్తరాంధ్రతోపాటు పలు ఇతర రాష్ర్టాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పీక్ అవర్స్‌లో కరెంటు యూనిట్ ధర పెంచాలంటూ మరో తాఖీదును జారీ చేసింది. ఆహారం, దుస్తులు, వసతిలాగా నేటి ఆధునిక యుగంలో కరెంటు ఒక మౌలిక అవసరం. దానిని ప్రజలకు ఎంత చవకగా అందిస్తే.. వారి జీవన నాణ్యత అంత మెరుగవుతుంది. వస్తు, సేవల ఉత్పత్తి కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఈ విధంగా దేశాభివృద్ధి కోణంలో కాకుండా కార్పొరేట్ మిత్రుల కోణంలో కేంద్రం విధానాలు తీసుకొస్తూ ప్రజలపై భారం మోపటం దారుణం. దీనిని కరెంటు ఉద్యోగులు మాత్రమే కాదు, యావన్మందీ వ్యతిరేకించా ల్సిన అవసరం ఉంది.