ఐదు నెలల్లోనే ఎంత తేడా? అంతా ఆగమాగం అయిపోయింది. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా ఎదిగిన తెలంగాణ వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయింది. 24 గంటల నాణ్యమైన కరెంటు ఏమైంది? చివరి మడికీ నిరంతరం పారిన నీళ్లు ఏమైనయ్? అర్ధరాత్రి అపరాత్రి కరెంటు కోసం బాయిలకాడికి ఉరుకుడు మళ్లీ షురూ అయింది. పొలాలల్ల బోరుబండ్లు చక్కర్లు కొడుతున్నయ్. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాలల్ల పోసుకున్నా పంటలు దక్కక రైతులు గోసపడే రోజులొచ్చినయ్. పంట వేయకముందు పడే పెట్టుబడి సాయం రైతుబంధు పడలే.
రేపుమాపంటూ తిప్పుకొని వేసే సరికి పంటకాలం అయిపోయింది. అదను దాటిన తర్వాత సాయం అందించారు. అదీ పాత లెక్కనే. పెంచిన అదనపు భరోసా ఇంకా అమలులోకి రానేలేదు. కిందామీద పడి పంట పండించి ఆ కొద్దిమొత్తం ధాన్యాన్ని మార్కెట్కు తీసుకుపోతే కాంటా పెట్టే నాథుడే కరువయ్యాడు. మద్దతు ధర గగనమైపోయింది. వడగండ్లు వచ్చి కొంత, మార్కెట్కు తెచ్చిన ధాన్యంలో వర్షం వల్ల ఇంకొంత నష్టపోతే ప్రభుత్వం నుంచి పరిహారం మాట దేవుడెరుగు, పలకరించే దిక్కే లేదు. భరోసా ఇచ్చే చేతులే లేవు. సాగును ఇలా గాలిలో దీపంలా మార్చిందెవరు? ఎంతలో ఎంత మార్పు? ఏమైంది వ్యవసాయానికి? కారణం ఎవరు? కారకులు ఎవరు?
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. వాటిని నమ్మబలకడానికి తగిలించిన గ్యారంటీలు, బాండ్లు.. అన్నీ ఉత్తుత్తివేనా? గాలిపోగేసిన మాటలేనా? ‘కేసీఆర్ ఇంతిస్తే మేం అంతిస్తా’మన్నవి అన్నీ గప్పాలేనా? ఇప్పుడు సర్కారు సాకులు వెదుకుతున్నది. రుణమాఫీపై రోజుకో మాటగా ఉంది. ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామంటూనే ఇతర రాష్ర్టాల్లో అధ్యయనాలు చేస్తామంటున్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. విధివిధానాలు రూపొందిస్తామంటున్నారు. ఈ తతంగమంతా దేనికి? మరింత తాత్సారం చేయడానికేనా? అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. తర్వాత వడ్లకు రూ.500 బోనస్ అన్నారు. ఇప్పుడు నాలిక మడతేసి సన్న రకానికే అని సన్నాయిరాగాలు తీస్తున్నారు. సన్నాలకు బోనస్ ఇస్తేనే వాటి సాగు పెరుగుతుందని సరికొత్త బాణీలు అందుకుంటున్నారు. దొడ్డు వడ్లు పండించే అన్నదాతలకు సున్నం పెడుతున్నారు. ఏతావాతా అన్ని ఇతర హామీల్లాగే బోనస్ కూడా బోగస్గానే తేలిపోతున్నది.
పదేండ్లుగా రైతే రాజుగా సాగిన వ్యవసాయ స్వర్ణయుగం మెల్లిగా సంక్షోభంలోకి జారిపోతున్నది. నిన్నటికి నేటికి పూర్తిగా మారిపోయిన పరిస్థితి రైతులను నిరాశానిస్పృహలకు గురిచేస్తున్నది. లెక్క చూసుకోకుండా ఇచ్చిన హామీల డొల్లతనం బైటపడుతుంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు కర్షక లోకం నడుం బిగిస్తున్నది. కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న సర్కారు మెడలు వంచేందుకు రైతన్నలు పోరుబాట పడుతున్నారు. సాగుకు సకల సౌకర్యాలు సమకూర్చి చివరి గింజ వరకూ మద్దతు ధరకు కొనుగోలు చేసి భరోసా కల్పించిన కేసీఆర్ అన్నదాతలకు అండగా ఆందోళన చేపట్టేందుకు ముందుకురావడం ముదావహం.