ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారీ బడుల్లో ఎన్రోల్మెంట్ 3.6 లక్షలు తగ్గితే, అదే సమయంలో ప్రైవేటు ఎన్రోల్మెంట్ 7 లక్షలు పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 25 శాతం మంది మాత్రమే సర్కారీ బడుల్లో ఉన్నారు. సర్కారు స్కూళ్లపై ప్రజలకు నమ్మకం తగ్గుతున్నది. ప్రైవేటు మోజు అంతకంత కూ పెరుగుతున్నది. అతి సామాన్య కుటుంబాలు సైతం ఏదో రకంగా ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నాయి. సర్కారు బడుల్లో బోధన సరిగ్గా ఉండటం లేదని, గత్యంతరం లేక పిల్లలను చేర్పించేవారు వారి భవిష్యత్తుపై ఆందోళన చెందే పరిస్థితి.
ఈ ఏడాది 1899 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. మూడేండ్ల కిందట ఈ సంఖ్య 1100 లోపే ఉండేది. 17 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గంటలవారీ జీతానికి పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో బండి నడిపిస్తున్నారు. టీచర్లున్న చోటికి విద్యార్థులు, విద్యార్థులున్న చోటికి టీచర్లు అనే సర్దుబాటు మరో రెండు వారాల్లో పూర్తయితే అనేక స్కూళ్ల భవితవ్యం తేలిపోతుంది. ఇవన్నీ గమనిస్తే సర్కారీ బడి అనేది అంతరించిపోతున్న జాబితాలో చేరుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. అయితే ఇదేదో అనుకోకుండా జరుగుతున్న సంగతి కాదు. కావాలనే ప్రభుత్వం సర్కారీ బడులను నిరాదరణకు గురిచేస్తున్నది. ఒకవైపు విద్యా కమిషన్ సిఫారసుల మేరకు మండలానికి 3 పబ్లిక్ స్కూళ్లు, 4 ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. వాటికి వేల కోట్ల నిధులు ఎక్కడి నుంచి తెస్తారో, ఉపాధ్యాయులను ఎప్పుడు నియమిస్తారో తెలియదు. ఉన్నవి అభివృద్ధి చేయకుండా ఇంకేదో సాధిస్తామని ఊరించడంలోనే సర్కారు దుర్బుద్ధి వ్యక్తమవుతున్నది. వీటిలో ప్రైవేటు పిల్లలు చేరరనేది తెలిసిందే. ఇదంతా బడుల మూసివేతకు సర్కారు పన్నుతున్న కుట్ర అని ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేయలేం.
పాఠశాల విద్యాశాఖకు పూర్తిస్థాయి డైరెక్టర్ కూడా లేరు. ఇదివరకు కనీసం మంత్రి పదవి అయినా నిర్వహించని సీఎం రేవంత్రెడ్డి అనేక శాఖలను ఎవరికీ ఇవ్వకుండా తనవద్దే అంటిపెట్టుకున్నారు. అందులో విద్యాశాఖ కూడా ఉంది. సాధారణంగా బడులు తెరిచేందుకు ముందే మే, జూన్ మాసాల్లో సమీక్షలు జరుగుతాయి. అయినా ఒక్కసారైనా సమీక్ష జరుగలేదంటే ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది. పాఠశాల విద్యలో రాష్ర్టాలకు ఇచ్చే ర్యాంకుల్లో తెలంగాణ వెయ్యికి 511 మార్కులు మాత్రమే సాధించింది. అభ్యాస ఫలితాలు, చదువుల నాణ్యతలో 11-20 శాతం మధ్యలో తెలంగాణ నిలువడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును పట్టిస్తున్నది.