సిలిండర్ ధరను మరోసారి పెంచి సామాన్యుడి బతుకును కేంద్రంలోని మోదీ సర్కార్ మరింత దుర్భరం చేసింది. మోదీ ఎనిమిదిన్నరేండ్ల హయాంలో ఇది అక్షరాలా 13వ పెంపు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.410. ఇప్పుడది రూ.1,155కు చేరింది. గృహ వినియోగ సిలిండర్ పరిస్థితి ఇలా ఉంటే.. వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలను చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. మోదీ అధికారంలోకి వచ్చే ముందు దాని ధర రూ.752 కాగా ప్రస్తుతం రూ.2,325కి చేరుకున్నది. సబ్సిడీ అయినా, నాన్-సబ్సిడీ అయినా గ్యాస్ ధర బీజేపీ పాలనలో మూడింతలు పెరిగిపోయింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే కేంద్రం ధరలు పెంచటం లేదు. పోలింగ్ ముగిసిన మరుక్షణం.. ఫలితాలు కూడా రాకముందే పెట్రో ధరలు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి.
ప్రజలంటే బీజేపీ దృష్టిలో సజీవ మానవులు కాదు. ఓట్లు మాత్రమే. ఓట్ల అవసరం తీరగానే ధరాఘాతం షురూ. ఈసారి కూడా.. ఈశాన్య రాష్ర్టాల్లో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రమే గ్యాస్ ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా ధరలు పెంచాలంటే ఏ ప్రభుత్వమైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే, ప్రజాగ్రహం పెల్లుబికితే అధికారం ఊడుతుంది కాబట్టి. బీజేపీలో, మోదీ సర్కార్లో ఈ భయం ఏ కోశానా కనిపించటం లేదు. కారణం.. వాళ్లు గత కొంతకాలంగా అనుసరిస్తున్న రాజకీయాలు. మతం పేరుతో ప్రజల్ని విడదీయటం అనే తమ పాచికపై బీజేపీకి అపారమైన నమ్మకం. ఈ మత్తుమందుకు తోడు దేశభక్తి అనే పూత. ఈ రెండింటితో జనాల్ని నిజమైన సమస్యల నుంచి మభ్యపెట్టగలమని మోదీ, షాల సారథ్యంలోని బీజేపీ బలంగా నమ్ముతున్నది.
గుజరాత్గానీ, కర్ణాటకగానీ.. ఏ ఎన్నిక అయినా మతచిచ్చు రేపటమే బీజేపీ వ్యూహంగా మారింది. ఆ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలంటే చులకన భావం ఏర్పడిపోయింది. అందువల్లనే ఈ అసాధారణ ధరల పెంపు. ఎనిమిదిన్నరేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ ధరను 300 శాతం పెంచి కూడా బీజేపీ భయపడటం లేదంటే ఎవరి వైఫల్యం? ప్రజలదా? ప్రజాసంఘాలదా? ప్రతిపక్ష పార్టీలదా? మేధావులదా? మీడియాదా? అందరూ ఆలోచించుకోవాల్సిన అంశమిది. ఇదే ప్రభుత్వానికి ఈ దేశ రైతాంగం గతంలో గుణపాఠం నేర్పించింది. తమ జీవితాలతో చెలగాటమాడబోతే రైతులు ఊరుకోలేదు. ఢిల్లీ వీధుల్లో ఏడాదికిపైగా కదం తొక్కి, అనేక త్యాగాల కోర్చి సాగుచట్టాలను రద్దు చేస్తామని ప్రధాని ప్రకటించే వరకూ విశ్రమించలేదు. ఆ పోరాట స్ఫూర్తిని దేశంలోని విభిన్న రంగాల ప్రజలు తీసుకోవాలి. పెరుగుతున్న ధరలతో భారమవుతున్న జీవితంతో నిశ్శబ్దంగా ఉంటే ఆ భారం మరింత పెరుగుతుందేగానీ తగ్గదు. విపక్షాలు కూడా ఈ సంక్షోభ సమయంలో తమ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజా నిరసనకు నాయకత్వం వహించాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలు చెల్లుబాటు కాబోవనే పరిస్థితులను సృష్టించాలి.