Cooking Oil | రోజూ వంట చేసేందుకు అందరూ భిన్న రకాల వంట నూనెలను ఉపయోగిస్తుంటారు. కొందరు పల్లి నూనె వాడితే కొందరు నువ్వుల నూనె, ఇంకొందరు సన్ ఫ్లవర్ ఆయిల్‌ను వాడుతారు. అయితే మార్కెట్లో మనకు చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది అసలు ఏ వంట నూనెను వాడితే మంచిది, ఏది మనకు లాభాలను అందిస్తుంది.. అని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. వంట నూనెలు ఎన్ని ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన నూనె వాడితేనే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. వంట నూనెల విషయంలో కొన్ని వందల ఏళ్ల నుంచి సైంటిస్టులు, మేథావులు ప్రతిసారి డిబేట్ నిర్వహిస్తూనే వస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం వంట నూనెల విషయంలో కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అసలు ఎలాంటి నూనెను వంటలకు వాడాలి, ఏ వంట నూనె వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయాలను తెలియజేస్తున్నారు.
చాలా మంది పల్లి నూనెను వంటలకు ఉపయోగిస్తుంటారు. పల్లి నూనెలో గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్ల ఈ నూనెను వాడితే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే అనేక పోషకాలను సైతం పొందవచ్చు. ఇక మార్కెట్లో మనకు ఆలివ్ నూనె కూడా లభిస్తుంది. ఇది అన్ని నూనెల కన్నా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆరోగ్య ప్రయోజనాలను మాత్రం అద్భుతంగా అందిస్తుంది. ఆలివ్ నూనెను వాడితే గుండె సేఫ్ గా ఉంటుంది. ఇందులోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే ఇతర నూనెల్లా ఈ నూనెను వేడి చేయాల్సిన పనిలేదు. నేరుగా వంటలపై చల్లి తినవచ్చు.
మార్కెట్లో మనకు సోయాబీన్ ఆయిల్ కూడా లభిస్తుంది. ఇందులోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే ఈ నూనెను వేపుళ్లకు ఉపయోగించకూడదు. అలా చేస్తే నూనెలో విషపదార్థాలు తయారవుతాయి. అలాంటి నూనె మనకు హాని చేస్తుంది. కనుక సోయాబీన్ ఆయిల్ విషయంలో ఈ జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది. అలాగే వంటలకు గాను ఆవనూనెను కూడా వాడవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సువాసనను అందిస్తుంది. ఊరగాయల తయారీలో ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అదేవిధంగా వంటలకు రైస్ బ్రాన్ ఆయిల్‌ను కూడా వాడుతారు. ఇందులోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకునేందుకు ఈ నూనె పనిచేస్తుంది. అలాగే పొద్దు తిరుగుడు నూనె కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కానీ ఈ నూనెను వాడితే పెద్దగా లాభాలు ఏమీ ఉండవు.
ఇక కొబ్బరినూనెను కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాల వాసులు వంటలకు ఉపయోగిస్తారు. ఇది అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదేవిధంగా అవిసె గింజల నూనెను కూడా వంటలకు ఉపయోగించవచ్చు. ఇది అనేక పోషకాలను అందిస్తుంది. ఈ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను, కళ్లను రక్షిస్తాయి. అయితే ఇన్ని రకాల నూనెల్లో వంటలకు ఏ నూనె వాడాలి..? అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. వంటలకు ఏ నూనెను ఉపయోగించినా సరే అది రిఫైన్డ్ అయి ఉండకూడదు. అంటే నూనెను సహజసిద్ధంగా తయారు చేసి ఉండాలి. గానుగ విధానంలో లేదా కోల్డ్ ప్రెస్డ్ విధానంలో తయారు చేసిన ఏ నూనెను అయినా సరే వంటలకు వాడవచ్చు. రీఫైన్ చేయబడిన నూనె వాడకూడదు. ప్యాక్ పై రీఫైన్డ్ అని రాసి ఉంటే అలాంటి నూనెను ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.