అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు సాగిస్తున్నారు. తుపాకులు పట్టుకొని యుద్ధం చేయడమే తప్ప దక్షతతో పాలించడం తాలిబన్లకు అలవాటు లేదు. మత పాలన పేర పెత్తనమే తప్ప, సాధారణ నిరసనలను కూడా సహించరు. దీనికితోడు ‘పరదా చాటున ఉండవలసిన మహిళలు’ వీధుల్లోకి ఎక్కడమేమిటనే ఆధిపత్య భావన వారిలో నాటుకొని ఉంటుంది. రెండు రోజులుగా ఉద్యమకారులను హింసాయుతంగా చెదరగొడుతున్నారు. కానీ ధిక్కార స్వరాన్ని తొక్కిపెట్టడం అంత సులభం కాదు. పరా యిదేశాల దళాలతో పోరాడుతున్నప్పటి పరిస్థితి వేరు. కానీ విదేశీ శక్తులు నిష్క్రమించిన తర్వాత భిన్న వర్గాలు ప్రజాస్వామ్య పాలనను, ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటాయి.
తాలిబన్లు అధికారంలోకి రాకముందు తమ ప్రాబల్య ప్రాంతా ల్లో మతం పేరిట అణచివేతను ప్రయోగించడం వేరు. కానీ ఇప్పు డు పాలకులుగా బాధ్యతాయుతంగా ఉండాలి. ఉగ్రవాద ముద్రను చెరిపేసుకొని, ప్రపంచదేశాల గుర్తింపు పొందడం అగ్ని పరీక్ష వంటి ది. ప్రపంచీకరణ కాలంలో ఏవో ఒకటి రెండు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని గట్టెక్కడం సాధ్యం కాదు. పౌర హక్కుల కు సంబంధించి ప్రపంచమంతా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నది. అందువల్ల మత విధానాల ముసుగులో ప్రజాస్వామిక హక్కులను అణచివేయడం సాధ్యం కాదు. పంజ్‌షీర్‌లో తాలిబన్లు అడుగు పెట్టినంత మాత్రాన వ్యతిరేకత సమసిపోయినట్టు కాదు. తజిక్‌ల తో పాటు ఉజ్బెక్, హజారా తదితర మైనారిటీ వర్గాలను అక్కున చేర్చుకొని బహుళత్వాన్ని గౌరవిస్తేనే శాంతి నెలకొంటుంది. లేకపోతే అసంతృప్త ప్రాతినిధ్యం లేని జాతులు నిరసనోద్యమంలో పాల్గొనవచ్చు. మహిళలు ఉద్యమించే పరిస్థితి ఉన్నదంటేనే అసమ్మతి తీవ్రత తెలుస్తున్నది.
తాలిబన్ల ప్రభుత్వం పట్ల భారత్ వంటి దేశాలు ఏ విధంగా వ్యవహరించాలనే చర్చ సాగుతున్నది. భారత్ ఇంతకాలం తాలిబన్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ, ఉత్తరాది తెగల నాయకత్వంతో సత్సంబంధాలను నెలకొల్పుకున్నది. కానీ ఉత్తరాది ముఠా నాయకులు నిర్వీర్యమైపోయారు. తాలిబన్లు అధికారంలో ఉన్నారనే వాస్తవాన్ని మొదట గుర్తించాలి. వారితో వ్యవహారాలు జరుపక తప్ప దు. అయితే తాలిబన్ల పాలనే అంతిమం కాదు. మతం పేరుతో ఆధునిక రాజనీతిని గుర్తించ నిరాకరిస్తున్న తాలిబన్ల పాలన పట్ల భవిష్యత్తులో వ్యతిరేకత వెల్లువెత్తడం ఖాయం. తాలిబన్లకు వ్యతిరేకంగా విదేశాలు చేసే యాగీ కన్నా, అంతరంగికంగా వ్యక్తమయ్యే నిరసనలే బలంగా ఉంటాయి. భారత్ వంటి దేశాలు ప్రజాస్వామ్య శక్తులకు సూత్రప్రాయమైన మద్దతు ఇవ్వాలి. ప్రజాస్వామిక పాలన వైపుగా అఫ్గానిస్థాన్ నడక సాగించాలని కోరుకోవాలి.