ఇన్స్పెక్టర్ రుద్ర ఇచ్చిన ఉల్లి ఐడియా సక్సెస్ కావడంతో ఖైదీ ఉరిశిక్ష పోస్ట్‌పోన్ అయ్యింది. రుద్ర అభ్యర్థన మేరకు సదరు ఖైదీని కలిసే ఏర్పాట్లు చేశాడు జైలు డిప్యూటీ సూపరిండెంటెంట్ కరణ్. ‘ఇప్పటికైనా చెప్పు.. అసలేం జరిగింది?’ ప్రాధేయపడుతున్నట్టు అన్నాడు రుద్ర. ‘నువ్వు అసాధ్యుడివి రుద్ర. అందుకే, చావు ముఖంలోకి వెళ్లిన నన్ను కూడా కాపాడావ్. నీకు ఇంతటి సత్తా ఉందని నమ్మాను కాబట్టే.. ఆ రహస్యం నీకు చెప్పా’ అంటూ కాస్త ఉద్వేగానికి లోనైన ఆ ఖైదీ ఆ తర్వాత కాస్త స్థిమితపడుతూ తన పేరును కమలాకర్‌గా పరిచయం చేసుకొన్నాడు.
దీర్ఘంగా నిట్టూరుస్తూ.. ‘రుద్ర.. నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు. రేపు చనిపోతావ్ అని తెలిసిన వ్యక్తి ఇంకెలా ప్రవర్తించగలడు చెప్పు..’ అంటూ అసలు విషయంలోకి వచ్చాడు కమలాకర్. ‘మొన్న మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఓ నలుగురు వ్యక్తులు మాట్లాడుకొంటున్న ఓ విషయం లీలగా నా చెవిలో పడింది. ఆ విషయం నాకు పూర్తిగా అర్థంకాలేదు గానీ, మన భారతీయులకు అసలు పిల్లలే పుట్టకుండా సామూహిక స్టెరిలైజేషన్ చేయడానికి కుట్రలు జరుగుతున్నట్టు ఆ వ్యక్తుల మాటలను బట్టి నాకు అర్థమయ్యింది. చైనా-పాకిస్థానీలు కలిసి ఈ కుట్రలకు తెగబడుతున్నాయట. ఆ రెండు దేశాల లక్ష్యం అసలు నెక్ట్స్ జనరేషనే ఇండియాలోకి రాకుండా చేయడమట. ముందు నేను కూడా ఇవేవో పిచ్చి మాటలు అనుకొని కొట్టిపారేశా. కానీ, ఆ నలుగురిలో ఒకడు 18వ శతాబ్దంలో రష్యాలో జరిగిన స్కోప్త్సీ ఉదంతాన్ని గుర్తు చేశాడు. అదేంటో నీకు తెలిసే ఉంటుందిగా’ అంటూ ప్రశ్నించాడు కమలాకర్. అవునన్నట్టు తలూపిన రుద్ర.. ‘147 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో అదెలా సాధ్యం? అంటూ ప్రశ్నించాడు.
‘అది ఎలాగో నాకు తెలియదు రుద్ర. కానీ, ఏదో జరుగబోతుందన్న విషయాన్ని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నా జీవితంలో ఎన్నో పాపాలు చేశా. వాటిలో కొంతైనా కడిగేసుకోవాలనుకొంటున్నా. అందుకే, ఈ మారణహోమం ఆపడంలో నా వంతు ప్రయత్నం చేస్తున్నా. వెంటనే ఈ ఘోర కలిని ఆపు’ అంటూ కమలాకర్ ప్రాధేయపడ్డాడు. తలా-తోకా లేనట్టు ఉన్న ఈ విషయాలతో రుద్ర మెదడు వేడెక్కిపోయింది. అలా కాసేపు తలపట్టుకొన్న రుద్ర.. ‘ఆ నలుగురు ఎక్కడ?’ అంటూ కమలాకర్‌ను ప్రశ్నించాడు. వాళ్లను చూస్తే, గుర్తుపడతానని చెప్పాడు కమలాకర్. అంతే, కరణ్ సాయంతో జైలులోని ఖైదీలందరినీ వరుసగా నిలబెట్టాడు రుద్ర.
దాదాపు 3 వేల మంది ఖైదీలు లైన్లో నిలబడ్డారు. రెండు గంటలైంది. లైన్లో ఉన్నవాళ్లలో ‘ఆ నలుగురు’ లేరంటూ కమలాకర్ చెప్పాడు. అదెలా సాధ్యమంటూ కరణ్‌ను ప్రశ్నించాడు రుద్ర. ఇంతలో అక్కడికి కంగారుగా పరిగెత్తుకొంటూ వచ్చిన ఓ జైలు వార్డర్.. ‘సార్.. సార్.. అక్కడ రూమ్ నంబర్ 25లో..’ అంటూ చెప్తూపోయాడు. అది విన్న రుద్ర, కరణ్ వెంటనే అటువైపుగా పరిగెత్తారు. వెళ్లిచూడగానే.. సెల్లో ‘ఆ నలుగురు’ రక్తపు మడుగులో కనిపించారు. ఎవరో వారిని దారుణంగా నరికి నరికి చంపారు. అది చూసిన రుద్ర, కరణ్ నిశ్చేష్టలైపోయారు. ‘ఇంత సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉన్న సెంట్రల్ జైలులో మర్డర్లు ఎలా?’ అంటూ రుద్ర ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫోరెన్సిక్ ఇంచార్జీ జయను లోపలికి రమ్మన్నారు. ఆమెతో పాటే హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి, స్నేహిల్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. డెడ్‌బాడీలను పరీక్షించిన జయ.. ప్రాథమికంగా ఇవి హత్యలేనని, పదునైన ఆయుధాలతో చంపారని నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో ఆ సెల్‌లోకి ఎవ్వరూ వెళ్లలేదని, బయటి వ్యక్తులు కూడా జైలులోకి ఎంటర్ కాలేదని సీసీటీవీ కెమెరాలు చెప్తున్నాయి.
పదునైన ఆయుధంతో బలిష్టంగా ఉన్న వ్యక్తులు దాడి చేయడం వల్లే ఆ నలుగురు చనిపోయారని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో స్పష్టమయ్యింది. కమలాకర్ సహా మిగతా ఖైదీలందరినీ విచారించి, వారి నుంచి వేలి ముద్రలు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ, ఏ ఒక్కరూ నిందితులుగా తేలలేదు. జైలు సిబ్బందిని కూడా ఇలాగే పరీక్షించారు. అయితే, ఎవ్వరూ అనుమానించదగినట్టు లేరు. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు పోతుందో అర్థంకాక రుద్ర తలపట్టుకొన్నాడు. ‘సెల్‌లోకి ఎవరు ఎంటరయ్యారు? శారీరకంగా దృఢంగా ఉన్న ఈ నలుగురిని ఒక్క వ్యక్తే ఎలా చంపగలిగాడు? వాడు దాడి చేస్తుంటే, వీళ్లు ఎందుకు అరవలేదు? ఇంత జరుగుతున్నా.. ఒక్కరూ కూడా ఎందుకు గుర్తించలేదు?’ ఇలా సవాలక్ష ప్రశ్నలతో రుద్ర తల తిరిగిపోతున్నది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకొంటూ వచ్చిన ఓ వార్డర్.. ‘సార్.. సార్.. ఆ సెల్ ఉన్న వరండాలో ఓ మూలకు ఈ చీటీ దొరికింది’ అని రుద్రకు ఇచ్చాడు.
అది తెరవగానే.. ko-lo-BOP-sis sawn-DER-see………. అని చైనా భాషలో రాసి ఉంది. ‘వీళ్లకు చైనీస్ వచ్చా?’ అంటూ రుద్ర అడిగిన ప్రశ్నకు రాదంటూ సమాధానమిచ్చాడు కరణ్. చీటీని స్కాన్ చేసి గూగుల్ ట్రాన్స్లెట్ను వాడిన రుద్ర.. ‘వీళ్లవి మర్డర్లు కావు. సామూహిక ఆత్మహత్యలు.. అది కూడా క్రూయెల్ సూసైడ్స్’ అంటూ తేల్చేశాడు. అదెలా కనిపెట్టావ్? అంటూ జయ అడిగిన ప్రశ్నకు.. ‘చీటీలో క్లియర్‌గా రాసి ఉంది కదా.. ko-lo-BOP-sis sawn-DER-see లాగానే మేము కూడా వెళ్లిపోతున్నాం అని’ అన్నాడు రుద్ర. ‘కో-లో-బాప్-సిస్-సాన్-దేర్-సీ అంటూ ఉన్న ‘ko-lo-BOP-sis sawn-DER-see’ అంటూ ఆ కోడ్ ఏంటో.. దాన్ని చూసిన రుద్ర.. ఇవి ఆత్మహత్యలు అనడమేంటో ఎవ్వరికీ అర్థంకాలేదు. వాళ్లవి ఆత్మహత్యలు ఎలా అయ్యాయో వివరించిన రుద్ర.. ఖైదీలు నిల్చున్న గ్రౌండ్లోకి వేగంగా పరిగెత్తాడు. అతన్ని అనుసరించారు మిగతా వాళ్లు. అదిపక్కనబెడితే, ‘ఆ నలుగురు’వి ఆత్మహత్యలు అని రుద్ర ఎలా కనిపెట్టినట్టు??
ko-lo-BOP-sis sawn-DER-see అనేది మలేషియాలోని ఓ చీమల జాతికి ఉచ్ఛరణ పదం. ఆ చీమల పేర్లు నిజానికి.. కోలోబాప్సిస్ సాన్దేర్సీ. వాటిని సూసైడ్ చీమలుగా పిలుస్తారు. అపాయం ఎదురైనా, లేక ఎవరి ఆజ్ఞలను శిరసావహించాలన్నా లేదా శత్రువులపై దాడి చేయాలన్నా ఓ రకమైన విష రసాయనాన్ని చిమ్ముతూ ఆ చీమలు బాడీని పేల్చేసుకొని ఆత్మహత్య చేసుకొంటాయి. ఆ చీమల లాగే ‘ఆ నలుగురు’ కూడా స్వతహాగానో లేదా వాళ్లలో వాళ్లే పొడుచుకొనో అత్యంత క్రూరమైన రీతిన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు రుద్ర నిర్ధారించాడు. వాళ్లకు వాళ్లే చనిపోయారు కాబట్టే, బయటి వ్యక్తులు వచ్చినట్టు ఎక్కడా ఆనవాళ్లు దొరకలేదని పేర్కొన్నాడు.